Advertisement

Advertisement


Home > Politics - Andhra

అధికారంలో లేకుంటే బాబుకు అన్నీ గుర్తుకొస్తాయ్‌!

అధికారంలో లేకుంటే బాబుకు అన్నీ గుర్తుకొస్తాయ్‌!

అదేంటో గానీ, అధికారంలో లేక‌పోతే చంద్ర‌బాబుకు అన్నీ గుర్తుకొస్తున్నాయి. రాజ్యాంగం, అంబేద్క‌ర్‌, ప్ర‌జాస్వామ్యం, స్వేచ్ఛ‌, స్వాతంత్ర్యం, నియంతృత్వం ఇలా ఏవేవో క‌ల‌గ‌లిపి ఆయ‌న మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించిన నాయ‌కుడెవ‌రైనా దాని గురించి మాట్లాడితే విన‌డానికి బాగుండేది. చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థాన‌మంతా రాజ్యాంగ ఉల్లంఘ‌న‌తో ముడిప‌డి వుంది. మామను కూల‌దోసి సీఎం సీటులో కూచోవ‌డం ఆయ‌న రాజ్యాంగానికి తూట్లు పొడిచార‌నేందుకు ప‌రాకాష్ట‌గా చెబుతారు.

చంద్ర‌బాబు పాల‌న‌లో బషీర్‌బాగ్‌లో కాల్పులు, వామ‌ప‌క్ష కార్య‌క‌ర్త‌ల మృతి, అలాగే అంగ‌న్‌వాడీ మ‌హిళా కార్మికుల‌పై భాష్ప‌వాయువు ప్ర‌యోగం, లాఠీ దెబ్బ‌లు, గుర్రాల‌తో తొక్కించ‌డం ఇలా ఎన్ని ఉదాహ‌ర‌ణలైనా చెప్పుకోవ‌చ్చు. అలాంటాయ‌న ఇవాళ అంబేద్క‌ర్‌కు నివాళుల‌ర్పించ‌డం గమ‌నార్హం. రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి చంద్ర‌బాబు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆ లేఖ సారాంశం ఏంటో తెలుసుకుందాం.

‘ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో రాష్ట్రంలో ఆరాచక, ఆటవిక పాలన సాగుతోంది. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’ అని డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్క ర్‌ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారు. ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తులో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన జరుగుతోంది. రాజ్యాంగ విలువల్ని పాటించడం లేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు’ ...ఇలా సాగింది చంద్ర‌బాబు లేఖ‌.

గ‌త 42 నెల‌ల జ‌గ‌న్ పాల‌న‌లో దాదాపు 330కి పైగా కేసుల్లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కోర్టు తీర్పులు రావ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ప‌నిలో ప‌నిగా త‌మ ప్రోగ్రాంకు ప్ర‌చారం క‌ల్పించేందుకు  ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి?’ అంటూ ఆయ‌న ప్ర‌స్తావించారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్షపార్టీగా తాము చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని ఆయ‌న పిలుపునిచ్చారు.  

రాజ్యాంగాన్ని గౌర‌వించి, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లకు అనుగుణంగా ఐదేళ్లు పాల‌న సాగించి వుంటే... ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టు కోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చేదో క‌నీసం ఒక్క‌సారైనా చంద్ర‌బాబు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకున్నారా? త‌న‌ను ఓడించిన ప్ర‌జ‌ల‌దే త‌ప్పు అన్న‌ట్టుగా ఇప్ప‌టికీ మాట్లాడే చంద్ర‌బాబు... అదే ప్ర‌జానీకానికి బ‌హిరంగ లేఖ రాయ‌డాన్ని ఏమ‌నాలి? త‌న‌కు వ్య‌తిరేక తీర్పు ఇస్తే ఎంత పెద్ద మాటైనా అన‌డానికి వెనుకాడ‌ని చంద్ర‌బాబు... త‌గదున‌మ్మా అంటూ రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించేందుకు త‌మ‌తో క‌లిసి రావాల‌ని పిలుపునివ్వ‌డం ఆయ‌న‌కే చెల్లింది. 

మ‌ళ్లీ అధికారం ఇస్తే...ప్ర‌తిప‌క్ష పార్టీల ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షిస్తాన‌ని చంద్ర‌బాబు మ్యానిఫెస్టోలో చేరుస్తారేమో అనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?