Advertisement

Advertisement


Home > Politics - Andhra

పాదయాత్ర కోసం ఇద్దరు నేతల పోటీ 

పాదయాత్ర కోసం ఇద్దరు నేతల పోటీ 

పాదయాత్ర మీద ఇప్పటి రాజకీయ నాయకులకు బాగా మోజు. పాదయాత్ర చేస్తే వ్యక్తిగత గుర్తింపు వస్తుందని, ఇమేజ్ పెరుగుతుందని, పొలిటికల్ మైలేజ్ వస్తుందని, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని నాయకుల భావన. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నాయకుల పాదయాత్రలు జోరుగా సాగుతున్నాయి. గతంలోనూ జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. 

గతంలో పాదయాత్రలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేయబోతున్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల చాలా కాలంగా పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటోంది కదా. అయితే ఇక్కడే మరో నాయకుడితో పోటీ మొదలైంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర చేసేందుకు సైలెంట్‌గా హైకమాండ్ వద్ద తనకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తాను కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నానని రేవంత్ చెప్పడంతో రాహుల్ అంగీకరించారు.

ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు దాదాపుగా పూర్తి  చేశారు. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎప్పటిమాదిరిగానే పార్టీలో రచ్చ మొదలైంది. పాద యత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి కాదని..  రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు. 

ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఇదే కోణంలో తెలంగాణలోనూ ఇద్దరితో పాదయాత్ర చేయించాలని కోరారు. దీంతో హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆలోచన చేసింది. దీంతో రేవంత్‌కు తోడుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. ఇద్దరూ కలిసి చేయాలని కొందరు అంటుంటే, భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను రేవంత్‌ చూసుకోవచ్చని మరికొందరు, రేవంత్‌ కచ్చితంగా పాదయాత్ర చేయాలని ఇంకొందరు సలహాలిస్తున్నారు. అసలు పాదయాత్రలు కాదని.. నేతలందరూ బస్సు యాత్ర చేయాలన్న ఓ ప్రతిపాదన కూడా హైకమాండ్ ముందు పెట్టారు. 

బస్సు యాత్ర ఖరారైతే దాదాపు 10 మంది నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సులో పర్యటించి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలందరూ ఐక్యంగా ఉన్నామనే సంకేతాలిచ్చినట్లవుతుందంటున్నారు. డిసెంబర్‌ ఆఖరులో కాంగ్రెస్‌కు సంబంధించిన ఏదో ఒక యాత్ర రాష్ట్రంలో ప్రారంభం అవుతుంది. సీఎల్పీ నేత భట్టి మాత్రం ఇప్పటికే పాదయాత్రకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌ వరకు యాత్ర చేసేందుకు ఆయన రూట్‌ మ్యాప్‌ కూడా తయారు చేసుకుని అధిష్టానానికి సమాచారమిచ్చారు. అయితే రేవంత్ పాదయాత్ర చేస్తేనే పార్టీలో ఊపు వస్తుందని ఆయన వర్గం అంటోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?