Advertisement

Advertisement


Home > Politics - Andhra

పథకాలు వద్దు అని ప్రజలు అంటే.. మంత్రి సంచలనం

పథకాలు వద్దు అని ప్రజలు అంటే.. మంత్రి సంచలనం

పప్పు బెల్లాలు పథకాలు అని విపక్షాలు ఆ మధ్య దాకా ఆడిపోసుకున్నాయి. పథకాలు పేరిట మొత్తం ఖజానా నుంచి డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు అని మండిపడిందీ ఇవే ప్రతిపక్షాలు. ఎపిలో బటన్ నొక్కి డబ్బులు వేయడమేనా పాలన అంటే అంటూ ఎకసెక్కమాడిందీ వీరే. అయితే సర్వే నివేదికలు చూసి విపక్ష శిబిరం ఖంగు తింది.

ప్రజలకు పథకాలు కావాలని గ్రహించింది. పథకాల పట్ల వారు ఆకర్షితులు అవుతున్నారని తెలుసుకుంది. పధకాలు కట్ చేస్తే మాత్రం వారు రివర్స్ అవుతారని గ్రహించింది. అందుకే అటు చంద్రబాబు కానీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ పథకాలు మేమూ కొనసాగిస్తామని కొత్త రాగం అందుకున్నారు. ఇంకా బాగా మేము సంక్షేమం అమలు చేస్తామని కూడా చెప్పుకున్నారు.

అపుడు వారికి ఖజనా చిల్లు పడడం, అప్పుల కుప్పగా ఏపీ కావడం, ఇంకా చెప్పాలంటే శ్రీలంక మదిరిగా ఏపీ అయిపోతుందని తామే అన్న మాటలు కూడా గుర్తుకు రాలేదు. బహుశా ఇదే వైసీపీలో ధీమా పెంచి ఉండవచ్చు. అందుకే సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని అంటున్నారు.

పథకాలను తాము ఎంతో వ్యయప్రయాసపడి అందిస్తున్నామని అంటున్నారు. వాటిని అందుకున్న ప్రజలు కూడా అనందంగా జీవిస్తున్నారని ఆయన చెబుతున్నారు. పధకాల మీద ఎవరు విమర్శలు చేసినా అర్ధ రహితమని కూడా ఆయన అంటున్నారు. ప్రజలకు పధకాలు కావాలని ఆయన అంటూ వద్దు అని జనాలను చెప్పమనండి తామే ఆపేస్తామని చెబుతున్నారు.

పథకాలు ఇస్తూంటే ఎవరు వద్దంటారు, డబ్బులు తమ ఖాతాలో పడుతూంటే వద్దనే వారు ఉంటారా. ఈ ధర్మ సూక్ష్మం తెలిసే ధర్మన ప్రసాదరావు వద్దు అని ఎవరైనా అనగలరా అని సవాల్ చేస్తున్నారు. ఎటూ విపక్షాలకు కూడా  పథకాలు ప్రభావం జనంలో ఉందని తెలిపోయినందువల్ల మంత్రి గారు మరింత రెట్టించిన స్వరంతో మా పధకాలు భేష్ మాకు మేమే శభాష్ అని చెప్పుకుంటున్నారు. 

పథకాలు తప్పు కాదు, వాటిని ఇవ్వడంలోనూ పొరపాటు లేదు కానీ అవే ప్రజలకు జీవిత కాల సమస్యలు పరిష్కరిస్తాయా అన్నది కూడా మంత్రి గారు ఆలోచించాల్సి ఉంది. పథకాలకు ఓట్లు రాలుతాయని విపక్షాలు కూడా నమ్ముతున్న వేళ అవి ఆగేది కూడాలేదు. కానీ ఇదే ధోరణితో రేపటి ఎన్నికల్లో పార్టీల మ్యానిఫెస్టో చాంతాడు అంతగా పెరిగితే మాత్రమే ఏపీకి అదే అసలైన ముప్పు. అదే అప్పు తప్పు కూడా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?