Advertisement

Advertisement


Home > Politics - Andhra

అమరావతికి చంద్రబాబు పేరు పెట్టమంటారేమో!?

అమరావతికి చంద్రబాబు పేరు పెట్టమంటారేమో!?

ఆరోగ్య యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరు తొలగించారు. వైఎస్ఆర్ పేరు పెట్టారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ తమకు అనుకూలమైన, తాము ఆరాధించే నాయకుల పేర్లను ఇలా పెట్టుకుంటూ పోవడం, పాత పేర్లను మార్చడం కరెక్టా కాదా? అనేది వేరే సంగతి. అయితే ఇలా పేర్లు పెట్టడానికి ప్రాతిపదిక ఏమిటి? ఏ సిద్ధాంతాన్ని ఏ సూత్రాన్ని అనుసరించి పేర్లు పెడుతున్నారు? అనే విషయాలను కూడా గమనించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టాడు అని నిందలు వేసే ముందు కొన్ని అంశాలను ప్రాక్టికల్ గా గమనించాల్సిన అవసరం ఉంది.

ఎన్జీ రంగా సుప్రసిద్ధ రైతు నాయకుడు. దేశవ్యాప్తంగా కూడా రైతు నాయకుడు గానే ఆయనకు గుర్తింపు ఉంది. రైతు అనే అజెండా ఆధారంగానే ఆయన బతికినంత కాలం రాజకీయం చేశారు. అలాంటి నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీరంగా పేరు పెట్టారు. ఇప్పుడు జగన్ మీద కుహనా విమర్శలకు దిగుతున్న తెలుగుదేశం నాయకులు భవిష్యత్తులో ఎన్జీరంగా యూనివర్సిటీ పేరు కూడా మారుస్తారేమో అనే కుత్సితమైన సందేహాలను వెలిబుచ్చుతున్నారు. 

ఇలాంటి విమర్శల ద్వారా వారు కులం కార్డును కూడా ప్రయోగిస్తున్నారు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఎన్జీ రంగాన్ని మించి మరొకరి పేరు పెట్టగల ఆస్కారమే ఉండదు. ఆయన పేరు అన్ని రకాలుగా సరైనది. అలాంటి నాయకుడి పేరును మార్చడానికి జగన్ ప్రయత్నించడం లేదు, ప్రయత్నించరు.

అదే సమయంలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు ఏ రకంగా నప్పుతుంది అనే విషయాన్ని కూడా చర్చించాలి. మెడికల్ కాలేజీలను ఒకే యూనివర్సిటీ కిందికి తీసుకు రావడం వరకే ఎన్టీఆర్ చేసిన పని. అంతే తప్ప ఆయన మెడికల్ కాలేజీలను కొత్తగా ప్రారంభించనూ లేదు.. ప్రజావైద్యం పరంగా సంచలన నిర్ణయాలు తీసుకోలేదు.. వైద్యం తెలిసిన డాక్టర్ కూడా కాదు! మరి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు ఎందుకు? వైయస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా డాక్టర్. 

ప్రజలకు డాక్టరుగా విస్తృత సేవలు అందించిన వ్యక్తి. ఆరోగ్య శ్రీ రూపంలో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆరోగ్య భద్రతను కలిగి ఉన్నారంటే అందుకు ప్రధాన కారకుడు దార్శనికుడు రాజశేఖర్ రెడ్డి. ప్రజల ఆరోగ్యం గురించి ఆయన తన తపనను అన్ని రకాలుగానూ నిరూపించుకున్నారు. హెల్త్ యూనివర్సిటీకి అలాంటి నాయకుడి పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడమే కరెక్ట్ కాదు.

కేవలం యూనివర్సిటీని చేసినందుకే ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబు అని వాదించేవాళ్లు.. అమరావతి నగరానికి గ్రాఫిక్ డిజైన్లు తయారు చేయించారు గనుక రేపు ఆ నగరానికి చంద్రబాబు నాయుడు పేరు పెట్టమంటారేమో! లేదా రాజధానిగా అమరావతి అనే పేరును తొలుత ప్రతిపాదించారు గనుక రామోజీరావు పేరు పెట్టమంటారేమో! అమరావతి గ్రాఫిక్ డిజైన్ల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు గనుక రాజమౌళి, వందేమాతరం శ్రీనివాస్, బోయపాటి శ్రీను తదితర సినిమా వాళ్ళ పేర్లను అమరావతి నగరంలో కాలనీలకు పెట్టమంటారేమో! అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు! 

వివేకం లేని వ్యక్తులు రాజకీయం చేస్తూ ఉంటే పరిస్థితులు ఇలాగే తయారవుతాయి. అర్థంపర్థం లేని, ఔచిత్యం లేని డిమాండ్లతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?