Advertisement

Advertisement


Home > Politics - Andhra

యువ ఎంపీకి జ‌గ‌న్‌ ప్రాధాన్యం

యువ ఎంపీకి జ‌గ‌న్‌ ప్రాధాన్యం

వైసీపీ యువ ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తికి అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ క‌మిటీలో ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విశేషం. ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలో వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. 

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రుగుతున్న ప్లీన‌రీ ఇది. అలాగే మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల్ని స‌మ‌రానికి స‌న్న‌ద్ధం చేసే క్ర‌మంలో ఈ ప్లీన‌రీని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఇటీవ‌ల టీడీపీ మ‌హానాడు విజ‌య‌వంత‌మైంద‌న్న ఉత్సాహంలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి. అధికారం త‌మ‌దే అన్న ధీమాని మ‌హానాడు క‌ల్పించింది. దీంతో మ‌హానాడును త‌ల‌ద‌న్నేలా వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌కు అధికార పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా వివిధ క‌మిటీల‌ను పార్టీ వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్లీన‌రీ నిర్వ‌హ‌ణలో కీల‌క పాత్ర పోషించే వాలంట‌ర్సీ క‌మిటీ క‌న్వీన‌ర్‌గా తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తిని నియ‌మించ‌డం విశేషం.

ఈయ‌న‌తో పాటు ఎమ్మెల్యేలు కొఠారు అబ్బ‌య్య‌ద‌రి, బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి, తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి త‌దిత‌ర ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌తో మొత్తం 16 మందితో కూడిన క‌మిటీని ఏర్పాటు చేశారు. సేవాద‌ళ్‌, విద్యార్థి , యువ‌జ‌న త‌దిత‌ర విభాగాల నుంచి పార్టీ వాలంటీర్ ఫోర్స్‌ను ఈ క‌మిటీ ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది. 

క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప్ర‌తినిధులంద‌రూ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వుంటుంది. ప్ర‌తినిధుల్లో ఎవ‌రికి ఏ అవ‌స‌రం వ‌చ్చినా వాలంటీర్లు సంయ‌మ‌నంతో సేవ‌లందించేలా ఈ క‌మిటీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?