Advertisement

Advertisement


Home > Politics - Andhra

మిమ్మ‌ల్ని కాళ్ల కింద ప‌డేసి తొక్కినా.. చెల్లెలు జైల్లో మ‌గ్గుతున్నా!

మిమ్మ‌ల్ని కాళ్ల కింద ప‌డేసి తొక్కినా.. చెల్లెలు జైల్లో మ‌గ్గుతున్నా!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు సానుకూల మాట‌లు మాట్లాడ్డం కూట‌మి నేత‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే నాయ‌కుడే లేక‌పోయి వుంటే మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం అయ్యి వుండేవార‌ని కేటీఆర్ అన్నారు. జ‌గ‌న్‌కు 11 ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చాయ‌ని, కానీ 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్ద‌ని కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై కూట‌మి నేత‌లు భ‌గ్గుమంటున్నారు.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్‌పై స‌ర్వేప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. సోమిరెడ్డి పోస్టు ఏంటంటే...

"బీఆర్ఎస్ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కు, కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ల కింద పడేసి తొక్కినా, మీ సొంత చెల్లెలు కవిత జైలులో మగ్గుతున్నా మీలో అహంకారం తగ్గకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్లకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది. ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు. జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో ఐదేళ్లు నలిగిపోవాలని ఆశించారు. అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకు పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్వీటే మీ కొంప ముంచిందని గుర్తుంచుకోండి"

కేటీఆర్‌, జ‌గ‌న్‌ను తిట్ట‌డ‌మే కాకుండా, చంద్ర‌బాబునాయుడు ఎంత గొప్ప నాయ‌కుడో సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ సీఎం అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌నేది కేటీఆర్ ఉద్దేశంగా సోమిరెడ్డి అభిప్రాయ‌ప‌డ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, చంద్ర‌బాబు అరెస్ట్ సంద‌ర్భంలో కేటీఆర్ చేసిన వ్యంగ్య ట్వీటే బీఆర్ఎస్ ఓట‌మికి కూడా కార‌ణ‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

సీమాంధ్రులు హైద‌రాబాద్‌లో ఉంటున్నారు. హైద‌రాబాద్‌లోనే బీఆర్ఎస్‌కు అత్య‌ధిక ఎమ్మెల్యే సీట్లు వ‌చ్చిన విష‌యాన్ని సోమిరెడ్డి మ‌రిచిన‌ట్టున్నార‌నే సెటైర్స్ నెటిజ‌న్లు విసురుతున్నారు. జ‌గ‌న్‌, కేటీఆర్‌ను ఘాటుగా విమ‌ర్శించ‌డం ద్వారా చంద్ర‌బాబు, లోకేశ్ మెప్పు పొందొచ్చ‌నేది సోమిరెడ్డి ఆలోచ‌నగా క‌నిపిస్తోంది.

 


  • Advertisement
    
  • Advertisement