Advertisement

Advertisement


Home > Politics - Andhra

అధికారం తెస్తాడో ....అపవాదు తెస్తాడో!

అధికారం తెస్తాడో ....అపవాదు తెస్తాడో!

మన తెలుగు రాజకీయ పార్టీల అధినేతలకు ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే ....ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తే అధికారం దక్కుతుందని వారు చాలా బలంగా నమ్ముతారు. ఇలా నమ్మడానికి రుజువులు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రం విడిపోయాక జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. 

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పాదయాత్ర చేసి వైఎస్ జగన్ సీఎం అయ్యారు. సో ....పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావొచ్చని ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. అధికారంలోకి రావడానికి ఇతరత్రా అనేక కారణాలుంటాయి. కానీ పాదయాత్ర అనేది తిరుగులేని సెంటిమెంటుగా మారింది. తెలుగు వారి నుంచే రాహుల్ గాంధీ నేర్చుకున్నట్లుంది. ఆయన కూడా దేశవ్యాప్త పాదయాత్ర చేస్తున్నారు.

ఇదే నమ్మకంతో లేదా సెంటిమెంటుతోనే చంద్రబాబు పాదయాత్ర చేయాలని కుమారుడు లోకేష్ కు చెప్పినట్లుంది. అతనికి కూడా పార్టీ అధికారంలోకి రావాలని, తండ్రి మళ్ళీ సీఎం కావాలని కోరికగా ఉండొచ్చు. అందుకని ఒకే అన్నాడు. అందులోనూ వచ్చే ఎన్నికలు టీడీపీకి చావో రేవో సమస్య. విజయమో, వీర స్వర్గమో తేలిపోవాల్సిందే. బాబు కూడా తనకు ఇవే చివరి ఎన్నికలు అని కూడా అన్నారు. దానికి తోడు వయసు కూడా మీద పడింది. అందుకే బాధ్యత కుమారుడికి అప్పగించారు. లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. ప్రధానంగా యువతను ఆకట్టుకోవాల్సి ఉంది. అందుకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. 

అది పార్టీకి అవసరం కూడా. ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం ఉండదు. మంగళగిరిలో పూర్తి స్థాయిలో కుదురుకోవడానికి కూడాలోకేష్ కు టైం ఉండకపోవచ్చు. పూర్తిగా ద్వితీయ శ్రేణి నేతలపైనే ఆయన ఆధారపడక తప్పదు. ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి రావడం కొంత కష్టమేనని పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పడే కష్టం మంగళగిరిపైన కూడా ప్రభావం చూపుతుందన్న వారు కూడా లేకపోలేదు. పాదయాత్ర వల్లనే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న కారణంతో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందన్న లెక్కలు లేకపోలేదు. అందుకే ఏడాది పాటు దూరంగా ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండబోదంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన పరిస్థిితి ఉంటుంది. చంద్రబాబు పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. జగన్ కూడా అంతే. 

కానీ లోకేష్ పాదయాత్ర చేసినా అధికారంలోకి రాలేకపోతే మాత్రం ఆ అపవాదు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అదే అధికారంలోకి వస్తే లోకేష్ కు వంద శాతం క్రెడిట్ లభిస్తుంది. చినబాబు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ యాత్రకు శ్రీకారం చుడుతుండటంతో పార్టీకి చెందిన యువతలో మాత్రం ఉత్సాహం పెల్లుబుకుతుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరే ఉండటంతో ఇప్పటినుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు 2023, జనవరి 27 నుంచి రాష్ట్రమంతటా పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు.  400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది.  2023, జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 

ఏడాదికి పైగా యాత్ర ద్వారా ప్రజల్లోనే ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ వేసుకున్నారు. పార్టీ నేతలతో పాటు యువత ఎక్కువగా పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నారు.  ప్రధానంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడమే కాకుండా ఎన్నికలకు కూడా సిద్ధమయ్యేలా లోకేష్ పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మరి ఓట్లను రాబట్టడంలో లోకేష్ యాత్ర ఏ మేరకు ఉప యోగపడుతుందనేది భవిష్యత్ లో తేలాల్సి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?