Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఈ స్థాయిలో అసంతృప్తి.. అదీ జగన్ పై.. అవసరమా..?

ఈ స్థాయిలో అసంతృప్తి.. అదీ జగన్ పై.. అవసరమా..?

మూడేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉన్న వారు వాటిని కోల్పోయిన తర్వాత సహజంగానే కాస్త ఇబ్బంది పడతారు. అందులో అనుమానమేం లేదు. కానీ పార్టీ ముందుగానే హింట్ ఇచ్చి, ఆ తర్వాత టైమ్ ఇచ్చి కొత్తవారికి మంత్రి పదవులివ్వడం కోసమే రాజీనామాలు అడిగితే అందులో తప్పేముంది. కానీ ఏపీలో మాత్రం అవకాశమిచ్చి ప్రోత్సహించిన జగన్ నే కొందరు ఎదిరిస్తున్నారు. 

మంత్రి పదవులు కోల్పోయినవారంతా దాదాపుగా సైలెంట్ గానే ఉన్నారు. కొంతమంది తిరిగి యాక్టివ్ అయితే, మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. ఇన్నాళ్లూ అనుభవించిన హోదా చాలనుకున్నారు. ఒక్క మేకతోటి సుచరిత మాత్రం అసంతృప్తి వెళ్లగక్కారు. ఏ స్థాయిలో అంటే ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారామె. అసలు సుచరితకు జరిగిన అన్యాయం ఏంటి..? ఎవరు చేశారు..?

విధేయత అంటే ఇదేనా..?

2009 లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత, వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ జట్టులో చేరారు. 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తరపున అదే స్థానం నుంచి గెలుపొందారు. 2014లో, 2019లో వరుసగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. సుచరిత పార్టీకి విధేయురాలిగా ఉన్నారు, ఆమెపై అదే స్థాయిలో అభిమానం చూపెట్టారు జగన్. 

మహిళను హోం మంత్రిని చేసి అందలమెక్కించారు. కానీ ఇప్పుడు సామాజిక సమీకరణాల వల్ల అవకాశం ఇవ్వలేకపోయారు. అంత మాత్రానికే జగన్ ని అపార్థం చేసుకుంటే ఎలా..? జగన్ పై చూపించే విధేయత ఇదేనా..?

మాజీలంతా రాజీనామాలు చేస్తే..?

రాజీనామాలు అడిగినప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు, మంత్రి పదవులు శాశ్వతం కాదని, పార్టీయే ముఖ్యమని, జగన్ కోసమే పనిచేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడిలా కొత్త వారి పేర్లు ప్రకటించాక అల్లరి చేయడం, అభిమానులతో గోల చేయించడం, చివరకు తామే రాజీనామాలకు సిద్ధపడటం.. ఇదంతా దేనికి. 

పదవులంటే కేవలం మంత్రి పదవులేనా, పార్టీ పదవుల్లో ఉండి, 2024లో పార్టీని గెలిపించుకోవడం ముఖ్యం కాదా.

2024లో తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చాక, పాతవారందరికీ అవకాశమిస్తానని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారు కదా. మరి ఆ హామీని కూడా పరిగణలోకి తీసుకోకపోతే ఎలా..?

కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి జగన్ తో వచ్చేసినప్పుడు విధేయత చూపించిన సుచరిత లాంటి వారు, పదవి ఇచ్చిన తర్వాత ఇలా మారిపోతారా అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ అభిమానులు. పరోక్షంగా ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశమిస్తున్నారని అంటున్నారు. 

ఏదేమైనా అసంతృప్తి ఓ స్థాయి వరకు సరిపెట్టుకోవచ్చు, మరీ రాజీనామాలంటే మాత్రం కాస్త కష్టమే. ఈ విషయంలో సుచరిత పునరాలోచించుకుంటే మంచిది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?