Advertisement

Advertisement


Home > Politics - Andhra

లోకేష్ పాదయాత్రకు గమ్యం, లక్ష్యం ఉన్నాయా?

లోకేష్ పాదయాత్రకు గమ్యం, లక్ష్యం ఉన్నాయా?

ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలను తెలుసుకుని వారికి మేలు చేయడానికి పాదయాత్ర చేస్తే ఒక ఎత్తు. పాదయాత్ర చేసిన వారు ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనే సంగతి తర్వాత.. కనీసం అలాంటి ప్రయత్నం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. పాలకులు ఇగ్నోర్ చేస్తున్న సమస్యలు ఏవైనా ఆ పాదయాత్ర చేసే నాయకుల దృష్టికి వస్తే వెంటనే ప్రభుత్వం దానిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. 

నిజానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వలన ప్రజలకు అలాంటి మేలు జరిగింది. పాదయాత్ర ప్రారంభించిన తర్వాత తాను పెన్షను రెండు వేలకు పెంచుతానని జగన్ చెప్పగానే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలర్ట్ అయ్యారు. ఆ హామీ తనను ముంచుతుందని భయపడి ఎన్నికలకు కొన్ని నెలలముందు పెన్షను తానే పెంచారు. అయితే ఆ కుయుక్తులకు విరుగుడుగా జగన్ తాను పెన్షను మూడువేలు చేస్తానని ప్రకటించడమూ.. మాట నిలబెట్టుకుంటుండడమూ జరుగుతోంది. అలా ప్రజల కష్టాల అధ్యయనం చేయడానికి జరిగే యాత్ర ఎవరుచేసినా అభినందించవచ్చు. 

కానీ నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర లక్ష్యం ఏమిటి? ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ యాత్ర చేస్తున్నారా? ఇంతకు మించిన హాస్యాస్పదమైన సంగతి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే.. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఒక బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలు బాధలు తెలుసుకోవాలని సుదీర్ఘకాలం పాటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలతో మేనిఫెస్టో రూపొందిస్తామని కూడా అన్నారు. మరి సమస్యలు తెలుసుకునే పర్వం పూర్తయింది కదా? నారా లోకేష్ చేయదలచుకుంటున్న యాత్ర గమ్యం, లక్ష్యం ఏమిటి?

పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ.. జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం, విచ్చలవిడిగా హద్దూ అదుపూ లేని విమర్శలు చేయడం తప్ప మరో లక్ష్యం ఉన్నట్టుగా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే.. ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం స్వరూపాన్ని చంద్రబాబు ఎలా ప్రకటించినా, ఆయన ఊరూరా తిరిగి జగన్ ను తిట్టడం తప్ప మరేం చేయలేదు. కేవలం జగన్ ను తిట్టడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రజలు కష్టాలు చెబితే.. తీర్చేస్తా అని హామీ ఇవ్వడానికి ఆయనేమీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. ‘మా పార్టీ  ప్రభుత్వం వస్తే’ అని మాత్రమే చెప్పగలరు. 

జగన్ సంగతి అలా కాదు కదా.. తన పాదయాత్రలో ఎవరే కష్టాలు చెప్పుకునే.. తాను ముఖ్యమంత్రిని అయ్యాక తీరుస్తానని ఆయన చెబితే వారు నమ్మారు. లోకేష్ అలా చెప్పే అవకాశమే లేదు. ఈ పాదయాత్ర అనేదే ఒక ఉబుసుపోక చేస్తున్న బురదచల్లుడు కార్యక్రమానికి సీక్వెల్ గా ఉన్నదే తప్ప.. చిత్తశుద్ధి గానీ, ఒక లక్ష్యం, గమ్యం గానీ కనిపించడం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?