Advertisement

Advertisement


Home > Politics - Andhra

ప్రేమ‌తో ప్ర‌త్య‌ర్థిని ఇరికిస్తున్న‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

ప్రేమ‌తో ప్ర‌త్య‌ర్థిని ఇరికిస్తున్న‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌హ‌జంగా శ‌త్రుత్వం కోరుకునే మ‌నిషి కాదు. ఏదో అలా సాగిపోవాల‌నే మ‌న‌స్త‌త్వంతో ఉన్న‌ట్టు ఆయ‌న రాజ‌కీయ పంథా గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ, తీవ్ర‌మైన శ‌త్రువుల్లా క‌నిపిస్తారు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులే త‌ప్ప శ‌త్రువులు ఉండ‌కూడ‌ద‌నే త‌త్వానికి పూర్తి విరుద్ధంగా ఇరువురు నేత‌లు, వారి అనుచ‌రులు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌ల క‌త్తులు దూసుకుంటుంటారు.

అలాగని వైసీపీ నేత‌లంతా శ‌త్రువుల‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావించ‌రు. తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విసిరిన స‌వాలే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే ప్రేమ‌గా ప‌వ‌న్ విసిరిన స‌వాల్ వైసీపీ నేత‌, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి రాజ‌కీయంగా కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. అస‌లు ఏం  జ‌రిగిందంటే...

చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ స‌వాల్ విసిరారు. చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించాల‌నేది ఆ స‌వాల్ సారాంశం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా, ప్ర‌ముఖ క్రికెట‌ర్ టెండూల్క‌ర్‌కు కూడా కేటీఆర్ స‌వాల్ విసిరారు. కేటీఆర్ స‌వాల్‌ను ప‌వ‌న్ స్వీక‌రిస్తూ... చేనేత వస్త్రాల‌ను  ధ‌రించి, ఆ ఫొటోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. రామ్ భాయ్ అంటూ కేటీఆర్‌కు ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

ఇదే సంద‌ర్భంలో మ‌రో ముగ్గురికి ప‌వ‌న్ "చేనేత"  స‌వాల్ విసిరారు. వారిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు, బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌, వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఉన్నారు. చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయాల‌ని ఆ ముగ్గురిని ఆయ‌న కోరారు. బాలినేనికి చేనేత స‌వాల్ విస‌ర‌డం వెనుక ఇటీవ‌లి ప‌రిణామ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తి మేరకు ప్ర‌కాశం జిల్లాలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌పై కేసు లేకుండా చేసిన‌ట్టు బాలినేని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదే బాలినేనిపై ప‌వ‌న్ ప్రేమాభిమానాల‌కు కార‌ణ‌మైంది. అయితే త‌న‌కు శ‌త్రువు అయిన ప్ర‌తి ఒక్క‌ర్నీ వైసీపీ నాయ‌కులు కూడా అట్లే భావించాల‌నే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న్‌ది. మ‌రి ప‌వ‌న్‌తో స్నేహ‌సంబంధాల‌ను జ‌గ‌న్ ఎలా చూస్తారో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?