cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Andhra

స‌జ్జ‌ల‌పై ప్ర‌త్య‌ర్థి ప్ర‌శంస‌లు...జ‌గ‌న్ ఎలా తీసుకుంటారో!

స‌జ్జ‌ల‌పై ప్ర‌త్య‌ర్థి ప్ర‌శంస‌లు...జ‌గ‌న్ ఎలా తీసుకుంటారో!

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను బ‌ద్ధ శ‌త్రువుగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భావిస్తారు. ద‌త్త పుత్రుడ‌ని వ్యంగ్యంగా అన‌డం త‌ప్ప‌, క‌నీసం ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరెత్త‌డానికి కూడా జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి నాయ‌కుడు త‌న స‌ల‌హాదారునిపై ప్ర‌శంస‌లు కురిపిస్తే ఇంకేమైనా వుందా? స‌జ్జ‌ల‌కు ఇది ఇబ్బందిక‌ర ప‌రిస్థితే.

కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డంపై ర‌గ‌డ రాజుకుంది. అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. కోన‌సీమ‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్ మీడియాతో మాట్లాడారు. మంత్రి విశ్వ‌రూప్‌, అలాగే వైసీపీ ఎమ్మెల్యే పి.స‌తీష్ ఇళ్ల‌ను వైసీపీనే త‌గుల‌బెట్టింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ అనేక ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌కు స‌ల‌హాదారునిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై మాత్రం ప్ర‌త్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడిదే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌జ్జ‌ల గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారంటే...

"వైసీపీలో మేధావులు, అనుభ‌వ‌జ్ఞులు ఉన్నారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అంటే నాకు చాలా గౌర‌వం. స‌జ్జ‌ల వంటి పెద్ద‌ల అనుభ‌వం కుల ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణం కాకూడ‌దు" అన్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మెప్పు పొందిన నేత జ‌గ‌న్‌కు స‌ల‌హాదారుడు కావ‌డం విశేషం. అయితే  శ‌త్రువులెవ‌రైనా త‌న స‌న్నిహితుల‌ను ప్ర‌శంసిస్తే జ‌గ‌న్ ఫీలింగ్స్ ఎలా వుంటాయ్‌? ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల జ‌గ‌న్ కేబినెట్ స‌మావేశంలో అన్న ఓ విష‌యం గురించి చెప్పుకుందాం.

"మంత్రులైనా, మ‌న ఎమ్మెల్యేలైనా ఎల్లో మీడియాతో మంచిగా వ్య‌వ‌హ‌రిస్తూ పాజిటివ్ స్టోరీలు రాయించుకుంటే మాత్రం ప‌రిణామాలు సీరియ‌స్‌గా వుంటాయి. అలాంటి నాయ‌కుల్ని నేను శ‌త్రువుగా భావిస్తాను. త‌స్మాత్ జాగ్ర‌త్త" అని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ హెచ్చ‌రిక స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి కూడా వ‌ర్తిస్తుంది. 

కాక‌పోతే ఎల్లో మీడియాకు బ‌దులు, సీఎం మాట‌ల్లోనే చెప్పాలంటే ఎల్లో ద‌త్త‌పుత్రుడి నుంచి మెప్పు పొందారు. ప్ర‌త్య‌ర్థులు లేదా శ‌త్రువులు కూడా కీర్తించేంత‌టి గొప్ప వ్య‌క్తిని స‌ల‌హాదారునిగా పెట్టుకున్నాన‌ని జ‌గ‌న్ సంతోషిస్తారా లేక మ‌రో ర‌క‌మైన ఆలోచ‌న చేస్తారా? అని వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి