Advertisement

Advertisement


Home > Politics - Andhra

అయ్యో, నాగ‌బాబు నిలువ‌రించ‌క‌పోతే...!

అయ్యో, నాగ‌బాబు నిలువ‌రించ‌క‌పోతే...!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు విచిత్రంగా ఉంటాయి. మ‌న‌సులో దేన్నీ దాచుకోరు. రాజ‌కీయ నాయకుడిగా ఎప్పుడెలా మాట్లాడాలో ఇంకా ఆయ‌న‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు లేదు. మంచైనా, చెడైనా ప్ర‌తి సంఘ‌ట‌న‌ను త‌న జీవితానికి వ‌ర్తింప‌జేసుకుని, ఉదాహ‌ర‌ణ చెప్ప‌డం ప‌వ‌న్‌కు అల‌వాటు. 

తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనంత‌పురం జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలురైతు కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆర్థిక సాయం, అలాగే ఓదార్పు యాత్ర ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ ప్ర‌సంగించారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న గురించి రైతాంగంతో పంచుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నారంటే...

"నేనూ ఒక‌ప్పుడు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించాను. నా సోద‌రుడు నాగ‌బాబు ధైర్యం చెప్ప‌డంతో విర‌మించుకున్నా. అన్నింటికీ ఆత్మ‌హ‌త్య ప‌రిష్కారం కాదు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తా" అని ప‌వ‌న్ భావోద్వేగంతో మాట్లాడారు. 

క‌ర‌వుకాట‌కాల‌తో అల్లాడుతున్న రైతాంగానికి ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్య‌మైన నేప‌థ్యంలో, వారిలో బ‌తుకుపై ఆశ చిగురింపచేసేందుకు ప‌వ‌న్ త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకున్న‌ట్టున్నారు.

అయితే ప‌వ‌న్‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే త‌లంపు ఎందుకొచ్చింద‌నేది ప్ర‌శ్న‌. రైతులకు వ్య‌వ‌సాయం గిట్టుబాటు కాక‌పోవ‌డం, క‌నీసం పెట్టుబ‌డులు కూడా చేతికి రాని ప‌రిస్థితుల్లో బ‌తుకుపై విరక్తి క‌ల‌గడాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. 

అయితే ప‌వ‌న్‌లో ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌ల‌ను ప్రేరేపించిన ప‌రిస్థితులు కూడా చెప్పి వుంటే, ఆయ‌న మాట‌లు జ‌నానికి మ‌రింత ఉప‌యోగ‌క‌రంగా ఉండేవి. ఏది ఏమైనా నాగ‌బాబు నాడు నిలువ‌రించ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?