Advertisement

Advertisement


Home > Politics - Andhra

కొడ్తార‌ని ఎంపీ గారు గ‌జ‌గ‌జ‌

కొడ్తార‌ని ఎంపీ గారు గ‌జ‌గ‌జ‌

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విచార‌ణ అంటే చాలు తీవ్రంగా భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా సీఐడీ పేరు చెబితే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ఈ విష‌యం మ‌రోసారి హైకోర్టు విచార‌ణ‌తో నిర్ధార‌ణ అయ్యింది. ర‌ఘురామ ఇంట్లోనే సీఐడీ విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు న్యాయ‌స్థానాన్ని కోర‌డాన్ని బ‌ట్టి ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. నిందితుడి ఇంట్లోనే విచార‌ణ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కుద‌ర‌ద‌ని సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాది తేల్చి చెప్పారు. తీంతో మ‌ధ్యేమార్గంగా హైకోర్టు ఓ సూచ‌న చేసింది.

రాజద్రోహం (సెక్షన్‌ 124ఏ)తోపాటు 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ర‌ఘురామ పిటిషన్‌ దాఖలు చేశారు. విచార‌ణ‌లో భాగంగా ఆస‌క్తిక‌ర వాద‌న‌లు చోటు చేసుకున్నాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ ఎంపీని సీఐడీ పోలీసులు ద‌ర్యాప్తు పేరుతో గ‌తంలో తీవ్రంగా కొట్టార‌ని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు.  

విచారణ పేరుతో పిలిచి మరోసారి భౌతిక‌దాడికి పాల్ప‌డే అవ‌కాశం ఉందంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. అందువ‌ల్ల సీఐడీ పిలిచిన చోటకి ఎంపీ వెళితే మంచిది కాద‌న్నారు. ఆన్‌లైన్‌ ద్వారా లేదా హైదరాబాద్‌లోని పిటిషనర్‌ నివాసంలో విచారణ చేస్తే అభ్యంతరం లేదన్నారు.

సీఐడీ త‌ర‌పు న్యాయ‌వాది ఏజీ శ్రీ‌రామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్లినప్పుడు సీఐడీ అధికారులను కాల్చాలని ఎంపీ తన భద్రతా సిబ్బందిని ఆదేశించడాన్ని గుర్తు చేశారు. ఇదే కేసులో నిందితులైన‌ మీడియా ప్రతినిధులను కూడా పిటిషనర్‌తో కలిపి విచారించాల్సి వుంద‌న్నారు. ఎంపీ ఇంటికి వెళ్లి విచారించడం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేస్తామని, ఎంపీ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్ స్పందిస్తూ ఇరువర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విచారించడం సాధ్యమేనా? ఒక‌వేళ అది కుద‌ర‌క‌పోతే విచార‌ణ‌కు సురక్షితమైన ప్రదేశాన్ని సూచించాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అనంత‌రం ఈ నెల 28కి కేసు వాయిదా వేశారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?