Advertisement

Advertisement


Home > Politics - Andhra

టీడీపీలో ఎవరైనా ఉన్నారా.. కమలం దుర్భిణి!!

టీడీపీలో ఎవరైనా ఉన్నారా.. కమలం దుర్భిణి!!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అర్జంటుగా బలోపేతం చేసేసి.. వచ్చే ఎన్నికల నాటికి అధికార పీఠంపై కూర్చోబెట్టేయాలనే తొందరలో ఆ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. తమ పార్టీకి ఉన్న నాయకులు అధికారం కోసం చాలరు అనే సంగతి వారికి క్లారిటీ ఉంది. అందుకే ఇతర పార్టీలనుంచి కూడా ఎంతమంది వీలైతే అంతమంది గట్టి నాయకులను పట్టుకొచ్చి.. సమరంలోకి దిగాలనేది కమలవ్యూహంగా కనిపిస్తోంది. పోల్చిచూసినప్పుడు కాస్త బలహీనంగా ఉన్న కాంగ్రెస్ కు గేలం వేయడం చురుగ్గానే జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక ఇక లాంఛనం! ఇంకా వీలైనంత మంది సీనియర్ రాజకీయ నాయకుల్ని పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో..  తమ పార్టీలోకి కలుపుకోవడానికి తెలుగుదేశంలో ఎవరైనా ఉన్నారా అని తెలంగాణ కమలదళం వెతుకుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శవాసనం వేసిఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు చేతగానితనం, ఆత్మహత్యాసదృశంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి శాసనసభ ఎన్నికలకు వెళ్లడం వంటి నిర్ణయాలు ఆ పార్టీ పుట్టి ముంచాయి. మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నాయకుడితో సహా.. పార్టీలొో చెప్పుకోదగిన నాయకులందరూ కూడా.. ఇవాళ తెరాసలో ఉన్నారు. దుకాన్ బంద్ చేస్తే.. జాతీయ పార్టీ అని చెప్పుకునే తమ డాబుసరి మాటలకు తిలోదకాలు ఇవ్వాలనే భయంతో.. ఈ రాష్ట్రంలో ఆపార్టీని కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి కాదు!

అయితే ఇంకా తెలుగుదేశంలో కొందరు నాయకులు మిగిలే ఉన్నారు. ఒక్కటంటే ఒక్క సీటు తెచ్చుకోగలిగేలా పార్టీకే దిక్కులేదంటోంటే.. అక్కడ ఇంకా నాయకులు ఎందుకున్నారనే ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది? అయితే.. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి తమ తమ నియోజకవర్గాల్లో స్థానిక సమీకరణలు కుదరని నాయకులు కొందరున్నారు. అందరిలాగా టీఆర్ఎస్ లోకి వెళ్లాలి. కానీ.. వెళ్లినంత మాత్రాన తమ నియోజకవర్గాల్లో తమకు టికెట్ దక్కే చాన్స్ లేదు.. ఇక వెళ్లడం ఎందుకు అనుకుంటున్న వారు మాత్రమే.. ఇంకా తెలుగుదేశాన్ని నమ్ముకుని ఉన్నారు. 

ఆ పార్టీనుంచి అలాంటి వారిని కూడా ఖాళీ చేసేయాలని ఇప్పుడు కమలదళం కాన్సంట్రేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ లో అంతో ఇంతో ధనబలమూ, జనబలమూ ఉన్నవారికి గేలం వేస్తున్న కమలదళం.. అదే మాదిరిగా తెలుగుదేశంలో కూడా జనబలం క్షీణించిపోయినా.. ధనబలం ఉన్న నాయకులైనా దొరుకుతారు కదా.. అనే ఉద్దేశంతో దుర్భిణి వేసి వెతుకుతోందిట. కనీసం తెలుగుదేశం నుంచి ఒకరిద్దరు దొరికినా వారిని కూడా కమలం పట్టుకుపోతుంది. 

ఆర్నెల్లకోసారి తెలంగాణ పార్టీ మీటింగు పెట్టి, ‘రాష్ట్రంలో తెలుగుదేశం ఆదరణ మళ్లీ పెరుగుతోంది. నెలకు కొన్ని రోజుల టైం కేటాయిస్తా.. తెలంగాణలో మళ్లీ మనం పూర్వవైభవం సంతరించుకుంటాం’ అని చంద్రబాబునాయుడు చిలకపలుకులు పలికితే.. బహుశా వాటిని వినడానికి కూడా నాయకులెవ్వరూ భవిష్యత్తులో మిగలకపోవచ్చు!!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?