Advertisement

Advertisement


Home > Politics - Andhra

సీమ‌లో పాద‌యాత్రా... దేనిక‌బ్బా?

సీమ‌లో పాద‌యాత్రా... దేనిక‌బ్బా?

రాయ‌ల‌సీమ‌లో పాద‌యాత్ర చేస్తామ‌ని అనంత‌పురం టీడీపీ నాయ‌కులు కాల్వ శ్రీ‌నివాసులు, ప‌య్యావుల కేశ‌వ్ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఎందుకయ్యా అంటే... రాయ‌ల‌సీమ‌లో సాగునీటి ప్రాజెక్టుల కోస‌మ‌ని చెబుతున్నారు. వాళ్లిద్ద‌రి ప్ర‌క‌ట‌న‌పై సీమ వాసులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే 2014-19 మ‌ధ్య రాష్ట్రాన్ని పాలించిన పార్టీ వారిదే. అధికారం ఉన్న‌ప్పుడు రాయ‌ల‌సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏమీ చేయ‌కుండా, పోయిన త‌ర్వాత మాత్రం టింగురంగా అంటూ ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం వారికే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

రాయ‌ల‌సీమలో నీటి ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌, అభివృద్ధి ల‌క్ష్యంతో ఈ నెలాఖ‌రు నుంచి పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్టు అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు కాల్వ శ్రీ‌నివాసులు, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌క‌టించారు. కాల్వ శ్రీ‌నివాసులు గ‌త ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు. అప్పుడు త‌న ప్రాంత నీటి ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌, అభివృద్ధి ఎందుకు గుర్తు రాలేద‌ని జ‌నం ప్ర‌శ్నిస్తున్నారు.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఏవీ గుర్తుకు రావ‌ని అంటున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు రాయ‌ల‌సీమ తాగు, సాగునీటి ప్రాజెక్టుల గురించి ప‌ట్టించుకుని వుంటే, ఇవాళ టీడీపీకి ఈ దుస్థితి ప‌ట్టేది కాదు క‌దా? అని పౌర‌స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. అప్ప‌ట్లో టీడీపీ పూర్తిగా రాయ‌ల‌సీమ విష‌యంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్లే త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని గుర్తు చేస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో 52 అసెంబ్లీ సీట్ల‌లో కేవ‌లం మూడంటే మూడు చోట్ల మాత్ర‌మే టీడీపీని గెలిపించిన వైనం గురించి జ‌నం చెబుతున్నారు.

అదేంటో గానీ చంద్ర‌బాబు అంటే సీమ వ్య‌తిరేకిగా ఆ ప్రాంతం భావిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న చ‌ర్య‌లుంటాయి. ఒక్క సాగు, తాగునీటి విష‌యంలోనే కాదు, మిగిలిన వాటిల్లోనే ఆయ‌న త‌న ప్రాంతానికి వ్య‌తిరేకంగానే నిర్ణ‌యాలు తీసుకున్నారు. 

అనంత‌పురానికి వ‌చ్చిన ఎయిమ్స్‌ను మంగ‌ళ‌గిరిలో పెట్టారు. అలాగే జీవో 120 ద్వారా సీమ‌తో పాటు నెల్లూరు జిల్లా వైద్య విద్యార్థుల హ‌క్కుల్ని కాల‌రాశారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల‌ను వ‌దిలేసి ప‌ట్టిసీమ క‌ట్టారు. ఒక‌వైపు పోల‌వ‌రం నిర్మాణంలో ఉండ‌గా, ప‌ట్టిసీమ నిర్మించ‌డం సాగునీటి నిపుణుల్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. చేసిన పాపాలకు ప్రాయ‌శ్చిత్తం చేసుకోడానికి అన్న‌ట్టు...పాద‌యాత్ర చేయ‌డానికి టీడీపీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?