Advertisement

Advertisement


Home > Politics - Andhra

వెంకన్న ఆలయంలో సమానత్వం నేతిబీరకాయలో నెయ్యి

వెంకన్న ఆలయంలో సమానత్వం నేతిబీరకాయలో నెయ్యి

దేవుడి ముందు అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే అంటూ ఉంటారు కొందరు మేధావులు. ఇది నిజమా అని తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే పచ్చి అబద్ధమని అర్ధమవుతుంది. కొన్ని విదేశాల్లో ఇది నిజమేమోగానీ మన దేశంలో మాత్రం కాదు. కానీ పదవుల్లో ఉన్నవారు, రాజకీయ నాయకులు తరచుగా ఈ స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. 

దేవుడి ముందు అందరూ సమానులే అనే మాట వెంకన్న కొలువై ఉన్న తిరుమలలో మాత్రం శుద్ధ అబద్ధం. శ్రీవారి ఆలయంలో భక్తులందరూ సమానం కాదని కొన్ని దశాబ్దాలుగా నిరూపితమవుతూనే ఉంది. ఎంతటి కొమ్ములు తిరిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, టీటీడీ చైర్మగా ఉన్నా ఈ పరిస్థితి మారదు. ఇది వాస్తవం. ఎందుకంటే తిరుమల ఉన్నది రాజకీయ నాయకుల చేతుల్లో కదా. పరిస్థితి ఎందుకు మారుతుంది?

ఇక ఏ విషయంలో చూసుకున్నా తిరుమలలో అక్రమాలు సర్వ సాధారణం. వెంకన్న దర్శనానికి వెళ్ళేవారిలో సింహభాగం మంది భక్తితో వెళ్ళరు. సెంటిమెంటుతో వెళతారు. సామాన్యులు భక్తితో వెళతారేమోగానీ, రాజకీయ నాయకులు, మంత్రులు, కీలక పదవుల్లో ఉన్నవారు తమ దర్పం, అధికారం, గొప్పదనం చూపించుకోవడానికే వెంకన్న దర్శనానికి వెళతారు. ఇలాంటివారు భక్తులుగా వెళ్ళరు కాబట్టి నిబంధనలు పట్టించుకోరు. సామాన్య భక్తుల ఇబ్బందులు పట్టించుకోరు. 

ఇక అధికార పార్టీ వారి, మంత్రుల సంగతి చెప్పక్కరలేదు. వీఐపీలు, వీవీఐపీలు వెంకన్న దర్శనానికి వచ్చినప్పుడల్లా వివాదం చెలరేగుతూనే ఉంటుంది. తిరుమల  ఓవైపు భక్తులతో కిటికిటలాడుతోంది. క్యూలైన్లన్నీ నిండిపోయి.. బయట కూడా భక్తులు బారులు తీరారు. 

ఈ క్రమంలో ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్ దాదాపు 50 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి 50 బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు.. 10 సుప్రభాతం టిక్కెట్లను జారీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్ సైతం కనీసం భక్తుల కష్టాలను పట్టించుకోకుండా ఇలా చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

భక్తులకు మాత్రం ఓ సిఫార్సు లేఖపై కేవలం 6 బ్రేక్ దర్శన టిక్కెట్లను మాత్రమే జారీ చేసే టీటీడీ.. తమ కుటుంబ సభ్యులలో ఒక్కరిద్దరు అదనంగా ఉన్నారన్నా అవకాశం ఇచ్చేది కాదు. వారికి కూడా దర్శనం కల్పించాలని ఎంత విన్నవించుకున్నా ఒక్క సిఫార్స్ లేఖపై 6మందికి మాత్రమే దర్శన టిక్కెట్లను కేటాయించేవారు. కానీ ప్రముఖులకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా టిక్కెట్లను జారీ చేయడంపై భక్తులు మండి పడుతున్నారు.. తమకో న్యాయం ప్రముఖులకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.

మంత్రుల అనుచరులు మాత్రం ప్రోటోకాల్ దర్శనాలతో శ్రీనివాసుడి దర్శనం పొందుతున్నారు. టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. కేవలం పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు జారీ నిబంధనలు ఉన్నా.. పదుల సంఖ్యలో అనుచరులని వెంట పెట్టుకుని మంత్రులు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత అని చెబుతున్నా.. అవి మాటలకే పరిమితం అవుతున్నాయనే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి ఉష శ్రీ చరణ్‌ను మీడియా ప్రశ్నించగా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆలయం దగ్గర నుంచి వెళ్లిపోయారు. 

అలాగే మంత్రిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై మంత్రి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. జులై 28న ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా దాదాపు 150 మంది అనుచరులతో వెళ్లి దర్శించుకోవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు.. తనతో పాటు తన 150 మంది అనుచరులు సామాన్య భక్తుల్లా.. క్యూలైన్లో వెళ్లి దర్శనం చేసుకున్నామని.. తమ వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు.

ఆయన అబద్ధం చెప్పడం తీవ్ర దుమారం రేపింది. ఈ వరుస వివాదాలపై టీటీడీ తీరుపై స్థానికులు, సామాన్య భక్తులు మండిపడుతున్నారు. సామాన్యులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటే మంత్రి మాత్రం భారీ సంఖ్యలో అనుచరులతో వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ సిఫార్స్ లేఖలపై కల్పించే బ్రేక్‌ దర్శనాలను ఈ నెల 21 వరకూ రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 

క్యూ‎లైన్‎లో భక్తులు 30 గంటలకు పైనే వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ సామాన్య భక్తులకు దర్శనం కల్పించకుండా.. అమాత్యుల సేవలో టీటీడీ అధికారులు తరిస్తుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?