Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆమెకు క‌ళ్లు నెత్తికెక్కాయి!

ఆమెకు క‌ళ్లు నెత్తికెక్కాయి!

తెలంగాణ నూత‌న సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌తి శుక్ర‌వారం ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌డానికి శ్రీ‌కారం చుట్టారు. ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా రేవంత్‌లాగే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోడానికి స‌మ‌యం కేటాయించాల‌నే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. గ‌తంలో వైఎస్సార్ నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌ను రేవంత్ ఆద‌ర్శంగా తీసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ హ‌రిత జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జాసంఘాల‌కు ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. కార్పొరేట‌ర్లు, కోఆప్ష‌న్ మెంబ‌ర్లు ప్ర‌జా స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి వారంలో కేవ‌లం ఒక్క‌రోజు మాత్ర‌మే గ‌డువు ఇస్తూ క‌మిష‌న‌ర్ హ‌రిత ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. హ‌రిత ఉత్త‌ర్వులు ఏంటో చూద్దాం.

"తిరుప‌తి నగరపాలక సంస్థ గౌరవనీయ డివిజ‌న్‌ కొర్పోరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు ప్రతి గురువారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు డివిజ‌న్ సమస్యల‌పై కమిషనర్‌ వారికి విన్న వించుకోగ‌ల‌రు"

ఈ స‌ర్క్యుల‌ర్‌పై టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి, అలాగే రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం క‌న్వీన‌ర్ మాకిరెడ్డి పురుషోత్త‌మ్‌రెడ్డి త‌దిత‌రులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సీరియ‌స్‌గా స్పందించారు. జీవీరెడ్డి ట్వీట్ ఏంటంటే...

"తిరుప‌తి కార్పొరేష‌న్ క‌మిష‌నర్ గారు ఇచ్చిన స‌ర్క్యుల‌ర్ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. కార్పొరేట‌ర్లు వ‌చ్చి క‌మిష‌న‌ర్ గారికి స‌మ‌స్య‌లు చెప్పుకోవాలంటే, అది కూడా వారిచ్చిన స‌మ‌యానికి ఎక్క‌డైనా పాల‌క‌వ‌ర్గం అధికారుల‌ను పిలుస్తుంది. కానీ ఇక్క‌డ అధికారులు పాల‌క‌వ‌ర్గాన్ని పిలుస్తున్నారు. ఇది మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన గౌర‌వం"

సీఎం జ‌గ‌న్‌కు విన్న‌విస్తూ పురుషోత్త‌మ్‌రెడ్డి ట్వీట్ చేశారు.. "ప‌రిపాల‌న‌ను మీరు ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డానికి, ఫ‌లాల‌ను పార‌ద‌ర్శ‌కంగా అందించ‌డానికి స‌చివాల‌య వ్య‌వస్థ‌ను తీసుకొచ్చారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు కొంద‌రు అధికారులు మీ ఆశ‌యాల‌కు విఘాతం క‌లిగిస్తున్నారు అన‌డానికి తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ జారీ చేసిన ఉత్త‌ర్వులే నిద‌ర్శ‌నం. ప‌రిశీలించ‌గ‌ల‌రు".

తిరుప‌తి క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హార శైలి విచిత్రంగా ఉండ‌డంపై టీడీపీ ఘాటుగా స్పందించింది. ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి అధికారుల‌ను పాల‌క వ‌ర్గం పిలిపించుకుంటుంద‌ని, తిరుప‌తిలో మాత్రం అందుకు రివ‌ర్స్‌గా సాగుతోంద‌ని జీవీరెడ్డి దెప్పి పొడిచారు. తిరుప‌తి క‌మిష‌న‌ర్ ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు వివాదాస్ప‌దంగా వుంది. తాజాగా ఆమె జారీ చేసిన స‌ర్క్యుల‌ర్ పరాకాష్ట‌కు చేరింద‌ని చెప్పొచ్చు. 

తిరుప‌తి క‌మిష‌న‌ర్ తీరుతో స్థానికంగా వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తెచ్చేలా వుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌మిష‌న‌ర్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని, స‌మ‌స్య‌లు చెప్పుకోడానికి త‌మ‌కు వారంలో ఒక గంట మాత్ర‌మే గ‌డువు ఇవ్వ‌డం ఏంట‌ని కార్పొరేట‌ర్లు నిల‌దీస్తున్నారు. ప్రజాప్ర‌తినిధుల్ని కూడా క‌ల‌వ‌కుండా ఉండేంత బిజీ ఏముంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?