cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఇక విశ్రాంతి జీవితంలోకి వెంకయ్య నాయుడు

ఇక విశ్రాంతి జీవితంలోకి వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి రాజకీయ శకం ముగిసింది. ఆయన ఇక విశ్రాంతి జీవితంలోకి వెళ్లిపోతున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన బీజేపీ గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించడంతో వెంకయ్య విశ్రాంతి జీవితంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రపతి పదవి దక్కనందుకు వెంకయ్య నాయుడు వ్యక్తిగతంగా బాధపడుతున్నారో లేదో తెలియదు.

రాష్ట్రపతిగా చేసి రాజకీయ జీవితం ముగించారంటే అదో ఘనతగా, గౌరవంగా, సంతృప్తిగా ఉంటుంది. కానీ ఆ సంతృప్తి ఆయనకు దక్కకుండా పోయింది. తెలుగువాడికి రాష్ట్రపతి పదవి రాలేదే అని తెలుగువారికి బాధగా ఉంటుంది. ఇది సహజం. మోడీ, అమిత్ షా ఆలోచన మేధావులకు ఉన్నత పదవులు ఇవ్వడం కాకుండా, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓట్ల రాజకీయాలను చూస్తున్నారు. ఇప్పుడున్నది వాజ్ పేయి, అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు కదా. రాజకీయాల్లో అన్ని భరించాల్సిందే తప్పదు. నిజానికి మోడీ తలచుకుంటే వెంకయ్య నాయుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకపోయేవాడా ? కానీ అంతర్గతంగా వారిద్దరికీ పడదని ఓ టాక్ ఉంది.

కానీ రాజకీయాల్లో తప్పనిసరి స్నేహాలు ఉంటాయి కదా. వెంకయ్య -మోడీ మధ్య కూడా అల్లాంటిదే ఉంది. వాస్తవానికి ఉప రాష్ట్రపతి కావడం వెంకయ్య నాయుడికి ఇష్టంలేదు. ఆయనకు ఆ పదవిని మోడీ -అమిత్ షా కలిసి బలవంతంగా కట్టబెట్టారు. రాజకీయాలలో చురుగ్గా ఉన్న వెంకయ్య ఎక్కడ తమకు అడ్డు తగులుతాడోనని వారు భయపడ్డారు. అందుకే సైలెంటుగా ఉండేలా ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఈ విషయంలో వెంకయ్య తన అసంతృప్తిని కొన్నిసార్లు పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా వ్యక్తం చేశారు.

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చురుగ్గా ఉన్న వెంక‌య్య‌నాయుడిని హ‌ఠాత్తుగా ఉప రాష్ట్ర‌ప‌తిని చేశారు. దీంతో ఆయ‌న గొంతు మూగ‌బోయింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇస్తార‌ని వెంక‌య్య ఆశ‌లు పెట్టుకున్నారు. బీజేపీ సిద్ధాంతాల‌కు అనుగుణంగానే త‌న ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. కానీ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. వెంక‌య్య‌నాయుడిలో కూడా న‌రేంద్ర‌మోడీ, అమిత్ షాకు 'రాష్ట్ర‌ప‌తి' క‌న‌ప‌డ‌లేదు. ఒడిశాలో ఉన్న ద్రౌప‌ది ముర్ముకు ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంది.

అద్వానీ త‌ర‌హాలోనే వెంక‌య్య‌నాయుడిని కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి బ‌ల‌వంతంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేయించబోతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మంచి వాగ్ధాటి, అన్ని పార్టీల నేత‌ల‌తో స‌న్నిహిత ప‌రిచ‌యాల‌నున్న‌వారిని ఉప‌యోగించుకొని పార్టీని బ‌లోపేతం చేసుకోవాలికానీ త‌మ రాజ‌కీయాల‌కు అడ్డు వ‌స్తార‌నే ఆలోచ‌నా రీతితో వారిని బ‌ల‌వంతంగా త‌ప్పించ‌డ‌మ‌నేది ఏ త‌ర‌హా రాజ‌కీయ‌మో త‌మ‌కు కూడా తెలియ‌డంలేద‌ని సీనియ‌ర్ రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి అంటే భార‌త ప్ర‌జాస్వామ్యానికి గుండెలాంటిది. అటువంటి ప‌ద‌విలో రాజ‌కీయ ఉద్ధండుల‌ను నియ‌మించ‌డానికి అన్ని పార్టీలు ప్ర‌య‌త్నిస్తుంటాయి.

వ‌ర్గ ప‌రంగా రామ్‌నాథ్ కొవింద్‌, ద్రౌప‌ది ముర్ముల‌ను ఎంపిక చేయ‌డంద్వారా ఆయా వ‌ర్గాల‌కు న్యాయం చేశామ‌ని అనుకుంటున్నారు కానీ ద‌శాబ్దాల త‌ర‌బ‌డి పార్టీ ఎదుగ‌ల‌కు కార‌కులైన‌వారికి, కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నవారికి మాత్రం తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌నేది మ‌న క‌ళ్లెదుట కనపడుతున్న వాస్తవం. లాల్‌కృష్ణ అద్వానీ ప్ర‌ధాన‌మంత్రి కావాల‌నుకున్నారు. కానీ ఉప ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్టుకున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక స‌మ‌యంలో అద్వానీ పేరే దేశ‌వ్యాప్తంగా విన‌ప‌డింది. కానీ రాజ‌కీయంగా తాను భిక్ష పెట్టిన న‌రేంద్ర‌మోడీకి మాత్రం త‌న గురువులో 'రాష్ట్ర‌ప‌తి' క‌న‌ప‌డ‌లేదు. ఎక్క‌డో ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను తీసుకొచ్చి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.

దీంతో అద్వానీ రాజ‌కీయాల నుంచి అంత‌ర్థాన‌మ‌య్యారు. శిష్యుడి చేతిలో ఎదురైన అవ‌మానం ఆయ‌న్ను జీవితాంతం బాధ‌పెడుతూనే ఉంది. ఇక వెంకయ్యనాయుడు.. తెలుగు వారి వెలుగు సంతకం. తేనెలొలుకు తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. వెంకయ్యనాయుడు. అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు.. వెంకయ్యనాయుడు. ఆయన పూర్తి పేరు ముప్పవరపు వెంకయ్యనాయుడు. 1949 జులై 1న నెల్లూరులోని చవటపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్ హైస్కూల్‌లో ఆయన చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, రమణమ్మ.

నెల్లూరులోని వి.ఆర్ కళశాలలో డిగ్రీ పూర్తి చేసిన వెంకయ్యనాయుడు.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971లో వివాహం చేసుకున్న ఆయనకు ఒక కుమారుడు హర్షవర్థన్, కుమార్తె దీపా వెంకట్ ఉన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వెంకయ్యనాయుడు.. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపారు. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. అదే సమయంలో తొలిసారి 1978లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1980 నుంచి బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో రెండోసారి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో వెంకయ్యనాయుడు తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2000లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు వెంకయ్యనాయుడు. ఇక.. 2002లో జానా కృష్ణామూర్తి అనంతరం వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2004, అక్టోబర్ 18 వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్నారు.

అయితే మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన జాతీయాధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2004 నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వెంకయ్యనాయుడు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగా.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని మోదీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరికం నిర్మూలన శాఖల మంత్రిగా పని చేశారు. 2017లో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి