Advertisement

Advertisement


Home > Politics - Andhra

విజ‌య‌సాయికి ఇప్పుడెందుకు అనుమానం!

విజ‌య‌సాయికి ఇప్పుడెందుకు అనుమానం!

రాజ‌ధాని ఎంపిక అధికారంపై వైసీపీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్ట‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ‌ధానుల ఏర్పాటు అధికారం రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు లేద‌ని హైకోర్టు తీర్పునిస్తూ, ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లుల్ని కొట్టి వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సుప్రీంకోర్టుకు ఏపీ ప్ర‌భుత్వం వెళ్ల‌లేదు. ఈ నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి ప్రైవేట్‌బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డంతో మ‌రోసారి రాజ‌ధాని అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

రాజ‌ధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు విస్ప‌ష్ట‌మైన అధికారం ఉండేలా రాజ్యాంగ స‌వ‌ర‌ణ కోరుతూ ఒక ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లును ఆయ‌న రాజ్య‌స‌భ‌లో ప్రవేశ పెట్టారు. ఒక‌టి అంత కంటే ఎక్కువ రాజ‌ధానులు ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ వ్య‌వ‌స్థ‌కే ఉంద‌ని, అయితే దీనిపై మ‌రింత స్ప‌ష్ట‌త కోరడంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వానికి చ‌ట్ట‌బ‌ద్ధంగా తిరుగులేని అధికారం క‌ల్పించే ఉద్దేశంతో ఆర్టిక‌ల్ 3ఎని చేరుస్తూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్ట‌డం ఈ బిల్లు ఉద్దేశ‌మ‌ని విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు.  

ఇప్ప‌టికే ఒక‌టికి రెండుసార్లు కేంద్ర‌ప్ర‌భుత్వం హైకోర్టులో రాజ‌ధాని విష‌య‌మై అఫిడవిట్లు దాఖ‌లు చేసింది. అందులో రాజ‌ధానుల నిర్ణ‌యాధికారం రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రింత స్ప‌ష్ట‌త కోర‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చ‌ట్టంలో రాజ‌ధాని ఎంపిక హ‌క్కు శాస‌న‌స‌భ‌కు లేద‌నడం వ‌ల్లే హైకోర్టు త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను కొట్టేసింద‌ని ఆయ‌న భావిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లొస్తున్నాయి.

మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను తీసుకురావ‌డంలో చ‌ట్ట‌ప‌ర‌మైన లోపాల‌ను స‌వ‌రించుకోవాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వం చేతిలో ఉంది. హైకోర్టు నుంచి మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను వెన‌క్కి తీసుకునే సంద‌ర్భంలో రాష్ట్ర ప్ర‌భుత్వం.... లోపాల‌ను స‌వ‌రించి తిరిగి తీసుకొస్తామ‌ని స్ప‌ష్టంగా న్యాయ‌స్ధానానికి చెప్పింది. ఇప్పుడు మాత్రం ఆర్టిక‌ల్ 3ఎని చేరుస్తూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేప‌ట్టాల‌ని కోర‌వ‌డం గ‌మ‌నార్హం. 

ఆ స‌వ‌ర‌ణ‌తోనే మూడు రాజ‌ధానుల‌కు అడ్డంకి తొల‌గిపోతుంద‌ని విజ‌య‌సాయిరెడ్డి న‌మ్ముతున్నారా? అనే ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా కేంద్రప్రభుత్వం ఒకటికి రెండుసార్లు  హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కూడా రాష్ట్ర అధికారాలపై అనుమానం ఎందుకనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?