Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌న‌సైనికుల ఘోష వినేదెప్పుడు?

జ‌న‌సైనికుల ఘోష వినేదెప్పుడు?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల గ‌డువు వుంది. దీంతో జ‌న‌సేన మెల్లిగా ఎన్నిక‌ల బాట‌లోకి వ‌స్తోంది. ఇది ఆ పార్టీ కోణంలో మంచి ప‌రిణామం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంతిమ ల‌క్ష్యం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అధికారం నుంచి దించేయ‌డ‌మే. తాను ముఖ్య‌మంత్రి కావ‌డం కంటే, ప‌వ‌న్‌కు జ‌గ‌న్ ఆ సీటులో ఉండ‌కూడ‌ద‌నేదే ప్ర‌ధాన ఆశ‌యం. ఎందుకంత క‌క్షో ఎవ‌రికీ తెలియ‌దు. క‌నీసం క‌క్ష క‌ట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కైనా ఆ విష‌యం తెలుసో తెలియ‌దో మ‌రి!

ఈ నేప‌థ్యంలో సామాన్యుడి ఘోష వినేందుకు ఈ నెల 3,10వ తేదీల్లో వీకెండ్స్‌లో విజ‌య‌వాడ‌లో జ‌న‌వాణి జ‌న‌సేన భ‌రోసా కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యించారు. ఆ తేదీల్లో మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య విజ్ఞాన కేంద్రంలో ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ అర్జీలు స్వీక‌రిస్తార‌ని జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలిపారు. వాటి ప‌రిష్కారానికి ఫాల్ అఫ్ వుంటుంద‌న్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఓకే గుడ్‌.

మ‌రి జ‌న‌సైనికుల ఘోష విన‌డానికి ప్ర‌త్యేక జ‌న‌వాణి కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆ పార్టీ గుర్తొస్తోందా? ఎందుకంటే ఎన్నిక‌లకు రెండేళ్ల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. ఇంత వ‌ర‌కూ గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క‌నీసం పార్టీ క‌మిటీల‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌నే లేక‌పోవ‌డంపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మండిప‌డుతున్నారు. అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లెవ‌రో ఇంత వ‌ర‌కూ తేల్చ‌కుండా, పొత్తుల పేరుతో కాల‌యాప‌న చేయ‌డం ఏంట‌నే ఆవేద‌న జ‌న‌సైనికుల్లో ఉంది.

పొత్తుల‌పై ప‌వ‌న్ రోజుకో మాట చెబుతుండ‌డంతో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నారు. అది పోగొడితే త‌ప్ప‌, పూర్తిస్థాయిలో జ‌న‌సేన కోసం వారు ప‌ని చేయ‌ని ప‌రిస్థితి వుంది. ఎందుకంటే జ‌న‌సేనాని పొత్తుకు వెళ్తారా? లేదా? వెళితే ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తారు? అలాంట‌ప్పుడు తాము ప‌ని చేసినా ప్ర‌యోజ‌నం ఏంట‌నే ప్ర‌శ్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను వేధిస్తోంది.

అలాగే తాము ప‌వ‌న్‌ను సీఎం చేయాల‌ని అనుకుంటుంటే, ఆయ‌న మాత్రం టీడీపీ అధినేత చంద్ర‌బాబు అధికార ప‌ల్ల‌కి మోయాల‌ని చూస్తున్నార‌ని, అది త‌మ‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేద‌ని, ఈ విష‌యాల‌ను చెప్ప‌డానికి పార్టీ కోసం ప్రత్యేకంగా స‌భ‌లు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌ని జ‌న‌సైనికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి లేదా సొంతంగా పార్టీ బ‌రిలో నిలుస్తుంద‌నే భ‌రోసా నింపాల్సిన బాధ్య‌త‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వుంద‌ని జ‌న‌సైనికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఈ నేప‌థ్యంలో ముఖ్యంగా పార్టీ కేడ‌ర్‌లో భ‌విష్య‌త్‌పై న‌మ్మ‌కం క‌లిగించే భ‌రోసా స‌మావేశాల‌ను నిర్వ‌హించాల‌ని జ‌న‌సైనికులు డిమాండ్ చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా అలాంటి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు జ‌న‌సేనాని ప్లాన్ చేస్తే మంచిదేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?