Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు చేస్తే శృంగారం.. మరొకరు చేస్తే..

బాబు చేస్తే శృంగారం.. మరొకరు చేస్తే..

తాను చేస్తే శృంగారం.. ఇతరులు చేస్తే వ్యభిచారం అనే తీరుగా పరిగణించే మూర్ఖులు మన సమాజంలో పుష్కలంగానే ఉంటారు. ఇప్పుడు పచ్చ మీడియా కూడా అదే పతన నీతిని పాటిస్తోంది. చంద్రబాబు చేసిన పనులు వేనోళ్ల శ్లాఘిస్తూ కీర్తిస్తూ వచ్చిన పచ్చ మీడియా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణలకు ప్రయత్నిస్తోంటే.. అక్కడేదో ప్రజాద్రోహం జరిగిపోతున్నట్లుగా రంగుపులిమి బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోంది. 

అమ్మఒడి పథకం విషయంలో జగన్ సర్కారు నలభై లక్షల మందికిపైగా తల్లులకు వారి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలను డిపాజిట్ చేస్తూ వస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి మాత్రమే కాకుండా, ప్రెవేటు స్కూళ్లలో చదివే వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. నెలకు మూడు వందల యూనిట్ల కంటె ఎక్కువ కరెంటు వాడుతున్న వారిని సంపన్నులుగా గుర్తించి వారిని ఈ పథకం నుంచి తొలగించారు. 

తాజాగా 75 శాతం హాజరు లేని పిల్లలకు కూడా అమ్మఒడి పథకాన్ని అందించడం లేదు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కారణాల వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న 44 లక్షలపైచిలుకు లబ్ధిదారుల్లో లక్షకంటె ఎక్కువ మంది లబ్ధిదారులు తగ్గుతారు. వీరంతా పిల్లలను బడికి సక్రమంగా పంపని వారు మాత్రమే అని గుర్తించాలి. 

బడికి వెళ్లడం వల్ల పిల్లలు అద్భుతంగా చదువుతారా లేదా అనేది వేరే సంగతి. కానీ పిల్లల్ని సక్రమంగా బడికి పంపండం తల్లిదండ్రుల బాధ్యత అనేది విస్మరించకూడదు. 75 శాతం హాజరు ఉండేలా బడికే పంపకపోతే.. వారికి ఈ పథకం ఎందుకు వర్తింపజేయాలి? ఇలా ఇస్తూ పోతే.. బడికి పంపకుండా ఎగ్గొట్టే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది కదా? నామ్ కే వాస్తే బడిలో పిల్లల పేరు నమోదు చేయించి.. వారిని బడికి పంపకుండా.. ప్రభుత్వం ఇచ్చే డబ్బు మాత్రం తీసుకుని గడిపితే దాన్ని ఎలా అరికట్టాలి? ఇలాంటి ప్రాక్టికల్ ఆలోచన ఏమాత్రమూ లేకుండా పచ్చ మీడియా చెత్తరాతలు రాస్తోంది. 

ఇదే పని చంద్రబాబునాయుడు చేసి ఉంటే.. సంస్కరణలతో అద్భుతంగా పథకాన్ని గాడిన పెడుతున్నారని రాసి ఉండేది. కానీ ఇప్పుడిలా నీచంగా అబద్ధపు దుర్మార్గపు రాతలకు దిగజారుతోంది. 

ఇంకా కామెడీ ఏంటంటే.. అమ్మఒడి అర్హుల జాబితాలను ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు పంపింది. అర్హుల జాబితా రావడం అంటే.. అనర్హులు ఎవరో తేలిపోయినట్టే కదా.! కానీ పచ్చమీడియా అనర్హుల జాబితా ఎందుకు పంపరు? అంటూ గగ్గోలు పెడుతోంది. 

పాతరోజుల్లో టెన్త్ రిజల్ట్స్ వస్తే.. పాసైన వారి నెంబర్లను పేపర్లో ప్రకటించేవారు. పాసైనవాళ్ల నెంబర్లు మాత్రం ఇస్తే ఎలా, ఫెయిలైన వారి నెంబర్లు కూడా ఇవ్వాలి కదా అని గోల చేస్తున్నట్లుగా ఉందీ గొడవ. 

ఇంత లేకిగా విషప్రచారం చేయడానికి, సంక్షేమ పథకాల్లో సరైన సంస్కరణల ద్వారా.. తల్లిదండ్రుల్లో పిల్లల చదువు పట్ల జవాబుదారీ తనాన్ని పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా తప్పు పడితే.. ఈ మీడియా బుద్ధుల గురించి ఏం అనుకోవాలి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?