Advertisement

Advertisement


Home > Politics - Andhra

మాధ‌వ్ రాస‌లీల‌లు...వైసీపీ మూల్యం!

మాధ‌వ్ రాస‌లీల‌లు...వైసీపీ మూల్యం!

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై వేటుకు వైసీపీ మీన‌మేషాలు లెక్కిస్తోంది. మాధ‌వ్ విష‌యంలో నాన్చివేత ధోర‌ణిపై సొంత పార్టీలోనే వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై వెంట‌నే స‌స్పెండ్ వేటు వేసి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను వైసీపీ చేప‌ట్టింది. అలాగే కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించిన కేసులో జ‌గ‌న్ కుటుంబ సభ్యుడైన వైఎస్ కొండారెడ్డిపై కేసు న‌మోదు, అరెస్ట్ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత క‌డ‌ప జిల్లా బ‌హిష్క‌ర‌ణకు కూడా ఎస్పీ సిఫార్సు చేశారు.

ఈ నేప‌థ్యంలో గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో కాల్ వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లు తీసుకోడానికి వైసీపీ ఎందుకు త‌ట‌ప‌టాయిస్తోంద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌ప్ప‌ని తేలితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మ‌రి మాజీ డ్రైవ‌ర్‌ను ఎమ్మెల్సీ అనంత‌బాబు చంపార‌ని ఎక్క‌డ నిరూపిత‌మైంద‌నే ప్ర‌శ్న‌లొస్తున్నాయి. ఒక నాయ‌కుడి చ‌ర్య‌లు పార్టీకి న‌ష్టం క‌లిగిస్తున్నాయ‌నే సంకేతాలు రాగానే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటారు. ఎమ్మెల్సీ అనంత‌బాబు విష‌యంలో మాత్రం వైసీపీ ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంది.

అవినీతి, హ‌త్యా రాజకీయాల‌ను జ‌నం పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోరు. ఇవ‌న్నీ రాజకీయాల్లో స‌ర్వ‌సాధార‌ణం అని స‌రిపెట్టుకుంటారు. కానీ ఒళ్లు మ‌రిచి దిగంబ‌రంగా క‌నిపించ‌డం, అత్యాచారాలు త‌దిత‌ర వ్య‌వ‌హారాల‌ను ప్ర‌జ‌లు స‌హించ‌రు. అందుకే గోరంట్ల మాధ‌వ్ ఎపిసోడ్‌ను ప్ర‌తిప‌క్షాలు దూకుడుగా జ‌నంలోకి తీసుకెళ్ల‌డం.

కానీ గోరంట్ల మాధ‌వ్ విష‌యానికి వ‌చ్చే స‌రికి వైసీపీ పెద్ద త‌ప్పు చేస్తోంది. ముందు మాధ‌వ్‌పై స‌స్పెండ్ వేటు వేసి, స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకుంటే తిరిగి పార్టీలోకి తీసుకుంటామ‌నే ప్ర‌క‌ట‌న చేసి వుంటే, పార్టీ, ప్ర‌భుత్వ ప‌రువు నిలిచేది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. వైసీపీ నాన్చివేత‌ను అవ‌కాశంగా తీసుకున్న ప్ర‌తిప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి.

వైసీపీ అని చెప్పుకోడానికి కూడా సిగ్గు ప‌డేలా గోరంట్ల మాధ‌వ్ ప్ర‌వ‌ర్త‌న ఉంద‌ని నాయ‌కులు వాపోతున్నారు. మాధ‌వ్ న్యూడ్ వీడియోపై విచార‌ణ జ‌రుగుతోంద‌ని, ఫేక్ కాద‌ని తేలితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వైసీపీ నేత‌లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇంకా న‌యం, అది టీడీపీ సృష్టి అని వైసీపీ నేత‌లు మాధ‌వ్‌ను వెన‌కేసుకురాలేదు. గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియోపై నివేదికకు ఇంకెన్ని రోజులు ప‌డుతుందో అర్థం కావ‌డం లేదు. ఈ లోపు మాధ‌వ్ న‌గ్న‌త్వాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ పూడ్చుకోలేని న‌ష్టాన్ని మాత్రం టీడీపీ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. గోరంట్ల‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తుగా నిలిచిన వైసీపీ ఆ మాత్రం మూల్యం చెల్లించుకోవ‌ల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?