చంద్రుడు లేని ‘జ్యోతి’.. మారిన స్ట్రాటజీ

ఓ వైపు కరోనా కష్టం.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు లేక అదో నష్టం. ఈ సమయంలో గతిలేక బీజేపీ తోక పట్టుకుని గోదారి ఈదేందుకే ప్రయత్నిస్తున్నారు రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన మార్పు…

ఓ వైపు కరోనా కష్టం.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు లేక అదో నష్టం. ఈ సమయంలో గతిలేక బీజేపీ తోక పట్టుకుని గోదారి ఈదేందుకే ప్రయత్నిస్తున్నారు రాధాకృష్ణ. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన మార్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పచ్చపాత పత్రికలకు సహజంగానే సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించడం పెద్దవార్త. ఈనాడు, జ్యోతి అలాగే వేశాయి. దాంతోపాటు ఈనాడు ఫ్రంట్ పేజీలో జగనన్న చేదోడుకి ప్రయారిటీ దక్కింది. బాబుని వదిలిపెట్టలేరు కాబట్టి, పార్టీ మారినవారిపై ఆయన ఫైర్ అంటూ ఫ్రంట్ పేజీలోనే కనిపించింది.

ఇక ఆంధ్రజ్యోతి విషయానికొద్దాం. ఈరోజు పేపర్లో అసలు చంద్రబాబు ఫొటో కనీసం పాస్ పోర్ట్ సైజ్ లో కూడా కనిపించలేదు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలిచ్చారు కానీ ఓన్లీ రైటప్ మాత్రమే. బాబుకి బదులు విచిత్రంగా ఫ్రంట్ పేజీ బీజేపీ నాయకులు ఆక్రమించారు. విజయవాడలో జరిగిన బీజేపీ వర్చువల్ సభకు ప్రయారిటీ ఇచ్చారు. పనిలో పనిగా జగన్ పై, సుప్రీం కోర్టు తీర్పుపై బీజేపీ నాయకులు చేసిన కామెంట్లను ప్రముఖంగా ఇచ్చుకున్నారు.

ఇదంతా చూస్తుంటే, చంద్రబాబుకి ప్రయారిటీ తగ్గించేసి, బీజేపీని మోయడం మొదలుపెట్టినట్టుంది “జ్యోతి”. బాలయ్య పుట్టినరోజు వార్త సహజంగానే సాక్షిలో కనపడలేదు. ఈనాడులో చంద్రబాబుతో కలసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోని సినిమా పేజ్ లో వేశారు. జ్యోతి మాత్రం జాగ్రత్తగా బాబుని తీసిపారేసి కేవలం వసుంధర, మోక్షజ్ఞతో కలసి బాలయ్య ఉన్న ఫొటోని సినిమా పేజీకి పరిమితం చేసింది.

మొత్తమ్మీద వార్త ఇచ్చే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబుని పూర్తిగా పక్కనపెట్టేసింది ఆంధ్రజ్యోతి, టీడీపీకి పెద్ద షాకిచ్చింది. అదే సమయంలో బీజేపీని మోస్తోంది. ఎలాగూ స్టేట్ యాడ్స్ మరో నాలుగేళ్లు రావు అని డిసైడ్ అయ్యారు కాబట్టి, బీజేపీ రాష్ట్ర నేతల సహకారంతో కేంద్ర ప్రభుత్వ యాడ్స్ తెప్పించుకునే ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది.. కేవలం ఇలాంటి సెంట్రల్ యాడ్స్ వల్లే ఏపీలో బీజేపీ అనుబంధ మ్యాగజీన్స్ దాదాపు 10 వరకూ బతికేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి కూడా ఇదే స్ట్రాటజీ అమలు చేయడానికి సిద్ధమైంది.

ప్రస్తుతానికి బీజేపీకి మాత్రమే వంతపాడి, టీడీపీ కూడా కమలానికి దగ్గరైన తర్వాత గతంలోలా బీజేపీ-టీడీపీ-జనసేనకి కలపి భజన చేయాలనే ఆలోచన రాధాకృష్ణది. సో.. కొన్నాళ్లపాటు జనం చంద్రజ్యోతిని కాకుండా కమల జ్యోతిని చూడాల్సి వస్తుందన్న మాట. 

‘జగనన్న చేదోడు’ ప్రారంభం