ఆంధ్రజ్యోతి కళ్లకు గంతలు కట్టుకుని తప్పుడు కథనాలు రాస్తోంది. నిరాధారమైన, ఊహాజనిత, సంచలన, వివాదాస్పద కథనాన్ని శనివారం వండివార్చింది. ‘న్యాయదేవతపై నిఘా!’ శీర్షికతో రాసిన తప్పుడు కథనంపై జగన్ సర్కార్ సీరియస్ అయింది. తన ఆరాధ్య పాలకుడు చంద్రబాబును ప్రజలు గద్దె దింపినప్పటి నుంచి ఆంధ్రజ్యోతి ఓర్వలేకపోతోంది. పాలన పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ సర్కార్‌పై మొట్ట మొదటి రోజు నుంచే విషం చిమ్మడం స్టార్ట్ చేసింది.
తాజాగా ఆంధ్రజ్యోతి కాలకూట విషం చిమ్ముతూ, దుర్మార్గానికి పరాకాష్టగా జర్నలిజం చరిత్రలో నిలిచిపోయేలా ఓ కట్టు కథనాన్ని రాసుకొచ్చింది. పెట్టుబడికి, కట్టుకథలకు పుట్టిన విషపుత్రిక పత్రికలని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. ‘న్యాయదేవతపై నిఘా!’ కథనాన్ని చదివితే ఆంధ్రజ్యోతి ఎంతటి విష పత్రికో అర్థమవుతుంది.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి తానిచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక, ఏదో ఒక రకంగా అడ్డంకులు సృష్టించాలనే పథకంలో భాగంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు.
చివరికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను జగన్ సర్కార్‌పై రెచ్చగొట్టి ఏపీలో ఓ వికృత క్రీడకు తెరలేపాలని ఇటీవల టీడీపీ, ఆంధ్రజ్యోతి కుట్ర పన్నాయి. పదేపదే ఏపీ హైకోర్టుపై జగన్ సర్కార్ ఏదో చేస్తోందని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ రాస్తూ, విమర్శలు చేస్తూ , వాటిని ప్రముఖంగా ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ నానా యాగీ చేస్తున్నాయి.
ఇటీవల జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెండ్‌కు గురైన రామకృష్ణ మధ్య ఫోన్ సంభాషణను న్యాయస్థానాలపై కుట్రగా క్రియేట్ చేసే ప్రయత్నాలు విఫలం కావడంతో సరికొత్త నాటకానికి ఆంధ్రజ్యోతి సాహసించింది. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ప్రముఖ న్యాయమూర్తితో పాటు మరో ఐదుగురి న్యాయమూర్తుల ఫోన్లను జగన్ సర్కార్ ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి ఆధార రహిత, ఊహాజనిత విషపు కథనాన్ని వెదజల్లింది.
ఆంధ్రజ్యోతిలో ఈ తప్పుడు కథనాలు రాయడానికి బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఏపీ హైకోర్టులో దృష్టిలో జగన్ సర్కార్‌ను విలన్‌గా క్రియేట్ చేసి మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే ఇలాంటి దుర్మార్గానికి ఆంధ్రజ్యోతిని అడ్డుపెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు వికృత క్రీడకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘బహుశా దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ జరగని ‘ట్యాపింగ్’కు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా న్యాయ వ్యవస్థపైనే నిఘా వేసినట్లు తెలుస్తోంది. ‘కోర్టులపై కుట్రలు’ లోతుగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనిపై న్యాయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది’ అంటూ ఏ ఆధారం లేకుండానే ఏకంగా తీర్పులిస్తూ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం సాకుతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం రాసింది. నిజంగా ఆంధ్రజ్యోతి దగ్గర అంత బలమైన ఆధారాలే ఉంటే మళ్లీ ప్రశ్నార్థకంతో రాయాల్సిన అవసరం ఏంటి? ఏం రాసినా తమను ఏం చేయలేరనే లెక్కలేని తనమా లేక బరితెగింపా? ఇందులో ఏదో ఒకటి అయితే తప్ప…న్యాయ వ్యవస్థపై రాసే అవకాశం ఎంత మాత్రం లేదు.
న్యాయ వ్యవస్థపై పదేపదే తమకేదో అచంచలమైన గౌరవం, న్యాయమూర్తులపై అపారమైన ప్రేమ ఉన్నట్టు కోర్టులపై జగన్ సర్కార్ కుట్రలంటూ రాస్తూ…అసలు కుట్రలు పన్నుతున్నదెవరు? దొంగే దొంగా దొంగా అన్న చందంగా జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణకు వక్రభాష్యం చెబుతూ, దాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలనే తాపత్రయం ఆంధ్రజ్యోతికి ఎందుకు? ఎవరి కోసం? గౌరవ ప్రదంగా తమ విధులు నిర్వర్తిస్తున్న న్యాయమూర్తులను పదేపదే ప్రసార సాధనాల్లో చర్చకు పెట్టడం ద్వారా వారిని బజారుకీడ్చేందుకు ప్రయత్నిస్తున్నది టీడీపీ, దాని అనుబంధ ఎల్లో మీడియా కాదా? దీని వల్ల టీడీపీకి, ఆంధ్రజ్యోతికి పోయేవేమీ లేవు.
ఎందుకంటే టీడీపీ, ఆంధ్రజ్యోతి అన్ని విధాలుగా భ్రష్టుపట్టి ప్రజల్లో చులకనయ్యాయి. అలాంటి వాళ్లు తమ స్వార్థం కోసం ఎవరిని భుజానకెత్తుకున్నా, వారి పరువు మర్యాదలకు భంగం కలుగుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.
అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ రావడం, లింక్‌ను క్లిక్ చేయడం, ఆ తర్వాత విపరీతమైన డిస్ట్రబెన్స్ రావడం తదితర అంశాలను సమాజానికి చెప్పడం ద్వారా కుట్రలకు పాల్పడుతున్నదెవరో తెలిసిపోతోంది. రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం అందించే న్యాయమూర్తులు…ఒకవేళ తమకు ఎవరి నుంచైనా, ఏదైనా అన్యాయం జరుగుతోందని భావిస్తే…వెంటనే చర్యలు తీసుకునే వారు కాదా? దాన్ని బజారున పెట్టాలని, పెట్టమని…అందులోనూ ఎలాంటి నైతిక విలువలేని ఆంధ్రజ్యోతికి సమాచారం ఇచ్చి, కథనాన్ని రాయించుకుంటారా?
ఒకవేళ ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నట్టు న్యాయమూర్తులు తమకు జరిగిన అన్యాయంపై మౌనం పాటిస్తున్నారంటే…ఇక లోకానికి ఏం న్యాయం చేయగలరనే అపనమ్మకాన్ని కలిగించినట్టవుతుంది కదా? ఎందుకంటే తమకే న్యాయం చేసుకోలేని వాళ్లు లోకానికి ఏం చేస్తారనే ప్రశ్న జనంలో కలిగితే…అది న్యాయ వ్యవస్థకు మాయని మచ్చ కాదా? ఇదేనా న్యాయ వ్యవస్థపై ఆంధ్రజ్యోతికి ఉన్న గౌరవ మర్యాదలు. ఏపీ హైకోర్టుతో దూరం పెంచాలనే కుట్రలో భాగంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఏపీ సర్కార్ సీరియస్‌గా ఉంది. ఈ కథనంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
ఇటీవల న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ఆంధ్రజ్యోతి ఓ పథకం ప్రకారం కుట్రపూరిత కథనాలు రాస్తోంది. ఆ కథనాల పరంపరలో న్యాయదేవతపై నిఘా కథనం పరాకాష్టగా ప్రభుత్వం భావిస్తోంది. ఇక మీదట ఉపేక్షిస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకోవాలని ముందుకెళుతోంది.
ఈ విద్వేష పూరిత కథనం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నిగ్గు తేల్చేందుకు సిద్ధమైంది. కొన్ని రాజకీయశక్తులు, కొన్ని మీడియా సంస్థలు పక్కా వ్యూహాంతో న్యాయవ్యవస్థను పక్కదారిపట్టించేందుకు కుట్రపన్నాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. దీనిపై చట్టప్రకారం, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇప్పటికే ప్రభుత్వం సంబంధిత న్యాయ నిపుణులతో సీరియస్‌గా చర్చలు సాగిస్తోంది.
ఆంధ్రజ్యోతి అనే శిఖండిని అడ్డుపెట్టుకుని వ్యవస్థలతో ఆటాడుతున్నదెవరో తేల్చే పనిలో జగన్ సర్కార్ పడింది. గత కొన్ని నెలలుగా ఇష్టానుసారం వార్తా కథనాలను వండివారుస్తూ చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టే రోజులు మరెంతో దూరంలో లేవని చెప్పొచ్చు.