తెలంగాణ పోలీస్ మరోసారి రూల్స్ మార్చేసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాన్ని రాజేశారు. ఈమధ్య తెలంగాణలో లాక్ డౌన్ మొదలైన సమయంలో ఇలాగే అంబులెన్స్ లు ఆపేసి హైకోర్టుతో చీవాట్లు తిన్నారు. అంబులెన్స్ లు ఆపేయడం రాజ్యాంగ విరుద్ధం అని, అసలెక్కడైనా అంబులెన్స్ లను అడ్డుకున్న పోలీసుల్ని చూశారా అంటూ ప్రశ్నించడంతో పోలీసులు సర్దుకున్నారు.
ఈ దశలో మరోసారి కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ శనివారం ప్రకటించారు. సరిహద్దు జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటి నివారణపై దృష్టిపెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇంకేముంది తెలంగాణ పోలీస్ మరోసారి సీన్ లోకి వచ్చేసింది. సరిహద్దులో అన్ని రూట్లను మూసివేసింది.
కృష్ణా జిల్లా నుంచి తెలంగాణలోకి వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలను అడ్డుకుని, కోదాడ దగ్గర మాత్రమే ఎంట్రీ అని చెప్పారు పోలీసులు. అంత కష్టపడి కోదాడకు వెళ్లినా ఈ-పాస్ చూపించాలంటున్నారు. దీంతో సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ పోలీసులపై విమర్శలు చెలరేగుతున్నాయి.
తెలంగాణలో ఉదయం 6 నుంచి 10గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. ఆ సమయంలో వాహనాలను పూర్తి స్థాయిలో రోడ్లపైకి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత కేవలం ఈపాస్ ఉంటేనే ఎంట్రీ అంటున్నారు. అయితే కేసీఆర్ ఆదేశాల తర్వాత, సడలింపు సమయంలో కూడా కొత్త రూల్స్ తెచ్చారు పోలీసులు. ఈ-పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ అంటున్నారు.
గరికపాడు, రామాపురం చెక్ పోస్ట్, మఠంపల్లి, పులిచింతల.. ఇలా అన్ని మార్గాలను మూసివేసి, కేవలం కోదాడ నుంచి మాత్రమే రమ్మంటున్నారు. దీంతో ఆ ప్రాంతంపై ఒత్తిడి పెరిగి వాహనాలు రోడ్లపై బారులు తీరాయి.
అంబులెన్స్ లు, ఇతర అత్యవసర సేవల వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు. అయితే భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్ లు కూడా మధ్యలో ఇరుక్కుపోయాయి. హడావిడిగా తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు, కొవిడ్ రోగులు, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో కూడా ఈ-పాస్ అడిగి ఇబ్బంది పెట్టడం సరికాదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.