తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా ఉంది. ఇటీవ‌లే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ర‌చ్చ ప‌తాక స్థాయికి చేరంది. సోలిపేట రామ‌లింగారెడ్డి…

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక అనివార్యం అయ్యేలా ఉంది. ఇటీవ‌లే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ర‌చ్చ ప‌తాక స్థాయికి చేరంది. సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌రణంతో దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక వ‌చ్చింది. ఎక్క‌డ‌ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణించినా ఇత‌ర రాజ‌కీయ పార్టీలు అక్క‌డ పోటీకి సై అన్నాయి.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మ‌ధ్య‌న త్రిముఖ‌పోరులో స్వ‌ల్ప మెజారిటీతో బీజేపీ ఆ సీటును నెగ్గింది. స్థానిక రాజ‌కీయాల ప్ర‌కార‌మే ఆ సీటును నెగ్గారో, మార్పుకు సంకేత‌మో కానీ.. బీజేపీ వాళ్లు ఆ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని వ్య‌వ‌హ‌రించారు. అక్క‌డ గెలిచాకా.. రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు.

దుబ్బాక‌లో విజ‌యంతో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ అమీతుమీగా త‌ల‌ప‌డింది. ఆ ఫ‌లితాలు ఎలా ఉంటాయో కానీ.. గ్రేట‌ర్ లో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం వీధివీధికి వ‌చ్చి ప్ర‌చారం చేసింది. ఒక కార్పొరేష‌న్ ఎన్నిక‌కు అంత మంది, ఆ స్థాయి వాళ్లు వ‌చ్చి ప్ర‌చారం చేయ‌డం బ‌హుశా ద‌క్షిణాదిన ఇదే తొలి సారి కావొచ్చు. ఒక‌వైపు గ్రేట‌ర్ పోలింగ్ కొన‌సాగుతున్న వేళ నోముల న‌ర్సింహ‌య్య మ‌ర‌ణంతో నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక‌లు అనివార్యం అయ్యాయి. 

దుబ్బాక‌తోనో, హైద‌రాబాద్ తో పోలిస్తేనో.. భిన్న‌మైన సామాజిక ప‌రిస్థితులు ఉన్న చోట ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఉప ఎన్నిక‌ను కూడా ఎలాగూ రాజ‌కీయ పార్టీలు సీరియ‌స్ గానే తీసుకుంటాయి. గ్రేట‌ర్ ఫ‌లితాల అనంత‌రం ఆ వేడి రాజుకోవ‌చ్చు. ఒక‌వేళ గ్రేట‌ర్ లో బీజేపీ త‌న ప‌రిస్థితిని మెరుగుపరుచుకుంటే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ను అది మ‌రింత సీరియ‌స్ గా తీసుకుంటుంది.

తెలంగాణ‌లో త‌మ ప‌ట్టు జార‌లేదు అని చాటుకోవ‌డానికి టీఆర్ఎస్ కు కూడా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతుంది. ఇప్పుడు పార్టీల‌కు రాజ‌కీయం త‌ప్ప మ‌రో ప‌ట్టింపు ఏమీ లేదు కాబ‌ట్టి..ఏ ఉప ఎన్నిక అయినా ర‌స‌వ‌త్త‌ర ర‌చ్చ‌గా మార‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.

చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది: కొడాలి నాని