రెండు నెలల తర్వాత ఎట్టకేలకు సస్పెండ్ జడ్జి రామకృష్ణకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ ఎల్లో చానల్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తల ఎగురేసి నరుకుతానని రామకృష్ణ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు.
దీంతో రామకృష్ణపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసును పీలేరు పోలీసులు నమోదు చేశారు. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన తండ్రిని అంతమొందించే కుట్ర జరుగుతోందని రామకృష్ణ తనయుడు ఆరోపించారు. ఆ తర్వాత రామకృష్ణ బ్యారక్ నుంచి కొత్త వ్యక్తిని మరోచోటికి తరలించారు. అలాగే రామకృష్ణ ఆరోగ్యం బాగాలేదనడంతో తిరుపతి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పించారు.
ఈ నేపథ్యంలో రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చిన ధర్మాసనం.. విచారణాధికారికి సహకరించాలని ఆదేశించింది. అలాగే కేసు అంశంపై మీడియాతో మాట్లాడొద్దని రామకృష్ణను హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఆయన పీలేరు సబ్‌జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నోరు పారేసుకోకుండా రామ…కృష్ణా అనుకుంటూ కాలం గడుపుతారా? లేక ఎంపీ రఘురామకృష్ణంరాజు స్ఫూర్తితో ప్రభుత్వంపై విమర్శలకు పాల్పడుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రఘురామకృష్ణంరాజుకు కూడా బెయిల్ మంజూరు సందర్భంలో సుప్రీంకోర్టు మీడియాతో మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను ఎంత మాత్రం పాటిస్తున్నారు, వాటిని తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకున్నారనే విషయాలు అందరికీ తెలిసినవే.
సస్పెండైన జడ్జి రామకృష్ణను కూడా అదే బాటలో ఎల్లో బ్యాచ్ ఉపయోగించుకుంటుందా? లేక బుద్ధిగా తన పనేంటో తాను చూసుకుంటారా? అనేది కాలం జవాబు చెప్పాల్సి వుంది.