పార్టీ బలపడుతుందనే నమ్మకం ఉంటే ఎవరైనా అందులో చేరతారు, తాము కూడా బలపడతామని ఆశిస్తారు. కానీ ఏపీ బీజేపీ అలా కాదు.. ఏకంగా చేరికల కోసం కమిటీలు వేస్తుందంట. ఆ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు చేరికలుంటాయట.
అసలు చేరే వారే లేరంటుంటే ఇక కమిటీలు ఎందుకు? ఏయే పార్టీలో ఎవరెవరు అసంతృప్తులో తెలుసుకుని వారికి గాలం వేసేందుకే ఈ కమిటీలు ఉపయోగపడతాయేమో..? ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేరికల కోసం ఇలా కమిటీ వేసి ఉండదేమో. తొలిసారిగా బీజేపీ, అందులోనూ ఏపీలో ఈ సాహసానికి తెరతీసింది.
అమిత్ షా తలంటు ఫలితం..
తిరుపతి మీటింగ్ లో అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు ఓ రేంజ్ లో కోటింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అమరావతి రైతు ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వలేదని చీవాట్లు పెట్టారు. అదే సమయంలో పార్టీ పటిష్టానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
చేరికలను ప్రోత్సహించాలని ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల ఫలితమే ఇప్పుడు ఈ చేరికల కమిటీ. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపించే పెద్ద స్థాయి నాయకులతో సంప్రదింపులు జరిపి స్మూత్ గా వ్యవహారం తెగేలా ఈ చేరికల కమిటీ పనిచేస్తుందట.
ఎవరొస్తారు, ఎక్కడి నుంచి వస్తారు..?
రఘురామలాంటి వాళ్లు మినహా వైసీపీలో అసంతృప్తులెవరూ లేరు. ఒకవేళ వైసీపీ, టీడీపీ నుంచి ఎవరైనా బయటికొస్తే.. అంతకంటే బలమైన అధికార పక్షం వైపు వెళ్లాలనుకుంటారే కానీ, ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీ వైపు వారు చూడరు.
ఇక జనసేన నాయకులు.. బీజేపీ నేతల్ని తమవైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారు. అంటే అటునుంచి ఇటు వస్తే స్వాగతిస్తారు కానీ, ఇటు నుంచి అటు వెళ్లేవారెవరూ కనిపించడం లేదు. మరి పోయి పోయి ఏపీలో బీజేపీలో ఎవరు చేరతారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆలూ లేదు, చూలూ లేదు చేరికల కోసం కమిటీ వేశాం అని అంటున్నారు సోము వీర్రాజు.