గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా అసెంబ్లీలో ఒక్కసారైనా అధ్యక్షా అనాలని కోరుకుంటారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ సమావేశాల కనీస హాజరుకూడా తప్పనిసరి. కానీ కరోనా వచ్చి అన్నీ మార్చేసింది. అసెంబ్లీకి వస్తామన్నా కూడా రావొద్దని చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంది ఈ వింత పరిస్థితి.
జగన్ సర్కార్ కు అఖండ మెజారిటీ ఉంది. అసెంబ్లీ తెరిస్తే వైసీపీ శాసనసభ్యులతో సభ కళకళలాడుతుంది. కానీ ఈసారి బడ్జెట్ సమావేశాలకు పూర్తిస్థాయిలో హాజరు అక్కర్లేదని చెప్పేసింది ప్రభుత్వం. వంద మంది వస్తే చాలని ముందుగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఆ సంఖ్యను మరింత కుదించింది.
దీంతో అతికొద్ది మంది సభ్యుల సమక్షంలో కొద్దిసేపటి కిందట ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇంకా చెప్పాలంటే సభలో ఎమ్మెల్యేల కంటే మంత్రులే ఎక్కువగా కనిపించారు. ఇక టీడీపీ ముందే ఈ సమావేశాల్ని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే.
కొద్దిసేపటి కిందట ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా అసెంబ్లీకి వచ్చి ప్రత్యక్షంగా ప్రసంగించే గవర్నర్, ఈసారి వర్చువల్ విధానాన్ని ఆశ్రయించారు. రాజ్ భవన్ నుంచి గవర్నర్ మాట్లాడుతుంటే.. అసెంబ్లీలో అంతా లైవ్ లో చూస్తున్నారు.
ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపి, 11 గంటల ప్రాంతంలో ఆర్థిక మంత్రి బుగ్గన 2లక్షల 30వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దాదాపు గతేడాది అంచనాలతోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అంతకంటే ముందు బుద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతికి సంతాపం తెలుపుతారు.
ఇలా 2-3 కీలక కార్యక్రమాలతో ఈ ఒక్క రోజులోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీకి వచ్చిన సభ్యులెవరైనా కావాలనుకుంటే అక్కడే కరోనా టెస్ట్ చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు.. సభ్యులు రెండో డోస్ కరోనా టీకా వేసుకునే ఏర్పాట్లను కూడా అసెంబ్లీ ప్రాంగంణంలోనే చేశారు.