ప్రస్తుతం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడంలో నిమగ్నమైనట్టుగా చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తమకు అన్ని ప్రాంతాలూ సమానమే అని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడినట్టుగా ఆయన తేల్చి చెప్పారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి దృష్టి కేవలం ఆయన, ఆయన సన్నిహితులు అమరావతిలో పెట్టిన పెట్టుబడుల మీదే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీకి మహానగరాల అవసరం లేదని, చరిత్ర నుంచి వర్తమానం నుంచి పాఠాలు నేర్చుకోవాలని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు 'హిందుస్తాన్ టైమ్స్' కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఇది..
కరోనాను మీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు కరోనా బారిన పడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు వెళ్లారు కదా, వారికి రాష్ట్ర వైద్య వ్యవస్థపై నమ్మకం లేదా?
ఈ ఏడాది మార్చి సమయానికి రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగల వైరాలజీ ల్యాబ్ ఒక్కటి కూడా లేదు. మార్చిలో తొలి అనుమానిత కరోనా కేసు గురించి నిర్ధారణ పరీక్షలకు శాంపిల్స్ ను బెంగళూరుకు పంపించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు 60 వేల పరీక్షలు చేయగల సామర్థ్యాన్ని పెంచుకున్నాం. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ పద్ధతిలోనే కరోనాను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తోంది ప్రభుత్వ యంత్రాంగమంతా.
అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా వ్యాప్తి పెరిగింది. లక్షలాది మంది వలస కార్మికులు సొంత రాష్ట్రానికి వచ్చారు. కరోనాను ధీటుగా ఎదుర్కొనడానికి అన్ని ఏర్పాట్లనూ చేశాం. 4,124 ఐసీయూ కేర్ యూనిట్స్ ను, 17,232 నాన్ ఐసీయూ బెడ్స్ ను, 17,161 జనరల్ బెడ్స్ ను, 1,620 వెంటిలేటర్స్ ను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉన్న సిబ్బందికి తోడు వైద్యవ్యవస్థకు బోలెడంత మ్యాన్ పవర్ ను ఏర్పాటు చేశాం. కేసులు పెరుగుతున్నా.. వాటిని ట్రీట్ చేయడానికి తగినన్ని ఏర్పాటు చేశాం. కరోనాను ఎదుర్కొనడానికి ఆంధ్రప్రదేశ్ వైద్య వ్యవస్థ ఇప్పుడు పూర్తి స్థాయిలో సమర్థతతో ఉంది.
కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని మీరు ఇది వరకే వ్యాఖ్యానించారు. ఒకవైపు ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కరోనాను నియంత్రించడంలో మీ వ్యూహం ఏమిటి?
కరోనాతో దీర్ఘకాలం కలిసి జీవించాల్సి ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు అంతా ఒప్పుకుంటున్నారు. వీలైనన్ని ఎక్కువ టెస్టులు చేస్తూ, కరోనా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేసింగ్ చేస్తున్నాం. ఇందుకోసం రెండు లక్షల మంది వలంటీర్లు, వేల సంఖ్యలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లు పని చేస్తున్నారు. 1.4 కోట్ల ఇళ్లలోని వారిలో ఎవరైనా ఆనారోగ్యంతో ఉన్నారా, వారిలో ఏవైనా కరోనా సింప్టమ్స్ తో ఉన్నారా.. అనే అంశం గురించి ఐదు సార్లు సమగ్రంగా సర్వే చేయించాం. డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేయిస్తున్నాం. ప్రతి ఇంటికీ వెళ్లి కోవిడ్ -19 పై, కరోనా వైరస్ వ్యాప్తిపై, మాస్క్ లు ధరించాల్సిన అవసరం గురించి వివరిస్తున్నారు వాళ్లంతా. మా ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయని ఆశిస్తున్నాం. త్వరలోనే కోవిడ్-19 కేసుల గ్రాఫ్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం.
'వైఎస్ఆర్ చేయూత పథకం' గ్రామాల్లో గేమ్ చైంజర్ అని మీ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని 45 నుంచి 60 యేళ్ల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇది అన్ని కులాల వారికీ, మతాల వారికీ లబ్ధి కలగడం లేదనే ఫిర్యాదు వస్తోందే?
45 యేళ్ల నుంచి 60 యేళ్ల లోపు ఉన్న మహిళలకు చేయూతను ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమే వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని ఆ వయసులోని 80 శాతం మంది మహిళలకు లబ్ధి కలుగుతూ ఉంది. దీంట్లో ఫలానా కులానికో, ఫలానా మతానికో అన్యాయం జరగడం లేదు. ఈ స్కీమ్ ఏ మతాన్నీ ఉద్దేశించినది కాదు.
పేదలకు ప్రత్యక్షంగా సాయం చేయాలనే మీ ప్రయత్నం అభినందనీయమే,. అయిత ఇదంతా మీరు ఓటు బ్యాంకును తయారు చేసుకోవడానికి చేస్తున్నారనే విమర్శలు వస్తుంటాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇవి భారం కాదా?
విద్య, వైద్యం, సాగునీటి పారుదల.. ఈ మూడు రంగాలపై ఖర్చును ఆర్థిక వ్యవస్థపై భారంగా చూడలేను నేను. ఇవి సమాజాన్ని నిర్మిస్తాయి. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లులకు పిల్లలను చదివించుకోగల శక్తి సమకూరుతోంది. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. వ్యవసాయదారులకు ఇచ్చే రైతుబంధు స్కీమ్ డబ్బులు కూడా సామాజికరంగం మీద ప్రభుత్వం పెట్టే పెట్టుబడిగానే చూడాలి. వీటి ఫలితాలు ప్రజలకు అందుతాయి. సామాన్య ప్రజలకు విద్య, వైద్యంపై ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
బయట వాళ్లకు అంతగా తెలీని అంశాలు ఏమిటంటే, నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకా.. పవర్ సెక్టార్ కు సంబంధించిన 40 వేల కోట్ల రూపాయల పాత బకాయిలను క్లియర్ చేశాను. గత ఏడాది కాలంగా అన్ని సంక్షేమ పథకాలకూ మా ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ము ఈ మొత్తానికి సమానంగా ఉంటుంది! ఆ 40 వేల కోట్ల గురించి ఎవరూ మాట్లాడరు. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు మాత్రం భారమని అంటారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో నాశనం చేశారు. రాష్ట్రం విడిపోయే నాటికి 1.17 లక్షల అప్పు రాగా, 2019 నాటికి అది మూడు లక్షలకు కోట్లకు చేరింది. పెండింగ్ బిల్లుల భారం వేరే. అదంతా మన దురదృష్టం అని చెప్పాలి. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.
ప్రత్యేకంగా విలేజ్ సెక్రటేరియట్, విలేజ్ వాలంటీర్ సిస్టమ్ అవసరం ఉందంటారా? అప్పటికే ఉన్న వ్యవస్థ ప్రజలకు అన్ని సేవలనూ అందించలేకపోతోందంటారా?
ఆంధ్రప్రదేశ్ లో 60 శాతం మంది ప్రజలు గ్రామాల్లో ఉంటారు. అంటే ఆ లెక్కన 60 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రామాలకు అందుబాటులో ఉండాలి. మేం అధికారంలోకి వచ్చేసారికి ఆ శాతం ఎంతో తెలుసా? ఆరు శాతం మాత్రమే! ఈ పరిస్థితుల్లో గ్రామ వలంటరీ, సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చాం. దీని వల్ల బోలెడంత మంది ఉపాధి దొరికింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు అనే కార్యక్రమాలు వారి ద్వారా జరుగుతున్నాయి. పథకాల అమలులో వారి పాత్ర చాలా కీలకం. ఇంతకు ముందు యువతకు ఉపాధి అంటే.. నిరుద్యోగభృతి అంటూ రెండు వేల రూపాయలు ఇచ్చారు. అలా వారికి రెండు వేలు ఇవ్వడం కన్నా.. గౌరవ ప్రదమైన శాలరీతో ఒక పని అప్పగించడం మంచిది కదా. కోవిడ్ విపత్తు సమయంలో అయితేనేం.. ఇతర సమయాల్లో అయితేనేం.. ఈ వ్యవస్థ విజయవంతం అయ్యింది.
జీఎస్టీ చెల్లింపుల విషయంలో కూడా కేంద్రం మొండిచేయి చూపుతోంది కదా, బయట అప్పులు తెచ్చుకోమని కేంద్రం రాష్ట్రాలకు చెబుతోంది కదా, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉంటుందా?
ఇట్స్ ఓకే, వాళ్లు కాస్త సమయం తీసుకుంటామంటున్నారు, కొన్ని డిలేస్ తో డబ్బులు చెల్లిస్తామంటున్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అర్థం చేసుకోగలిగినదే. కోవిడ్ ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల మీద కూడా పన్నుల భారాన్ని కొత్తగా మోపలేమని, అప్పులు తెచ్చుకోవాలని కేంద్రం చెబుతోంది. మేం సాధ్యమైన మార్గాలను అన్వేషిస్తున్నాం.
కొత్త విద్యావిధానం లో మీరు ప్రామిస్ చేసిన ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనను ఎలా అమలు చేస్తారు?
కనీసం ఐదో తరగతి వరకూ తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కేంద్రం తెచ్చిన కొత్త విద్యావిధానంలో పేర్కొన్నారు. దీంతో ఆరో తరగతిని నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనను అమలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఐదో తరగతి వరకూ ఇంగ్లిష్ పై పిల్లలకు ప్రాథమిక అవగాహనను తీసుకు వచ్చి, ఆరో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం బోధనకు ఇప్పుడు అవకాశం ఏర్పడిందని అనుకుంటున్నాం.
తెలుగుపై ప్రేమ లేకో, ఇంగ్లిష్ పై వ్యామోహంతోనో మేం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావాలని అనుకోవడం లేదు. ఉద్యోగాల సాధనలో ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థులే ముందుంటున్నారు. ఆర్థిక శక్తి ఉన్న వాళ్లు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లి ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. అలాంటి శక్తి లేక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారు వెనుక పడకూడదనే మేం ఆంగ్లమాధ్యమ బోధనను తీసుకురావాలని అనుకుంటున్నాం.
కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు కూడా ఐదో తరగతి వరకూ మాతృభాషల్లోనే బోధనను కొనసాగించి, ఆరో తరగతి నుంచి మాత్రమే ఇంగ్లిష్ మీడియం బోధనను అమలు చేస్తే..అప్పుడు ఎవరికీ ఏ సమస్యా ఉండదు! ఏపీ ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా విద్యా విధానాన్ని అమలు చేస్తుంది.
రాష్ట్రం విడిపోయాకా.. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా అంశం గురించి వదిలేశారు, ఏపీకి ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని నిర్మించడం గురించి మాట్లాడేవారు. బెంగళూరు, చెన్నై లాంటి నగరం అనే వారు. మీరు అలాంటి నినాదాలు చేయడం లేదే..
మేం ప్రత్యేకహోదా డిమాండ్ ను వదలలేదు. ఈ విషయంలో కేంద్రాన్ని కోరుతూనే ఉంటాం. ఇక మహానగరం అనే టాపిక్ విషయానికి వస్తే.. నగరాలే దేశానికి పునాది అనే వాదన కరెక్ట్ కాదు. నగర నిర్మాణం అనేది ప్రభుత్వం లక్ష కోట్లు తెచ్చి మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడితే జరిగేది కాదు. దాని వల్ల అదనపు ఆదాయం మాటెలా ఉన్నా.. అప్పుల్లో కూరుకుపోయి, వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుంది. అమెరికాలో ఒమహా అనే చిన్న నగరం ఉంది. దాని జనాభా నాలుగు లక్షలు. కానీ 23 'ఫార్చూన్ -500' కంపెనీల హెడ్ క్వార్టర్లు ఆ ఊర్లోనే ఉన్నాయి. వారన్ బఫెట్ అక్కడే ఉంటాడు. బిల్ గేట్స్ సీటెల్ నుంచి వ్యాపారాలను ఆపరేట్ చేస్తూ ఉంటారు. మహానగరాల్లో వారెవరూ లేరే?
మహానగరాల నిర్మాణం అనేది శతాబ్దాల్లో జరిగేది, కోవిడ్ పరిస్థితుల్లో మనం మరిన్ని పాఠాలను నేర్చుకుంటున్నాం. ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందిన నార్వే, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్.. మహానగరాలేవీ ఈ దేశాల్లో లేవు! దీన్ని బట్టి అభివృద్ధికి నిర్వచనాలను అర్థం చేసుకోవాలి. డెవలప్ మెంట్ అంటే భారీ భవనాలు కట్టడమో, వాటి కోసం కోట్ల రూపాయలు వెచ్చిండం కాదు. అమరావతి పేరుతో భారీ ఇన్ఫ్రాస్టక్చర్ ను డెవలప్ చేయడానికి డబ్బులు కావాలి కదా, ఆర్థిక కోణం నుంచి ఈ అంశాన్ని ఆలోచించలేదు వాళ్లు. ఆర్థిక అంశాల ను పరిగణనలోకి తీసుకుంటే.. అది అసాధ్యమని బోస్టన్ కన్సల్టెన్సీ కూడా తేల్చి చెప్పింది.
మూడు రాజధానుల వెనుక ఉన్న మీ అడ్మినిస్ట్రేటివ్ విజన్ ఏమిటి?
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అన్నీ అమరావతి, కర్నూలు నుంచి జ్యూడీషియల్ ఫంక్షన్స్.. ఇవన్నీ శివరామకృష్ణన్ కమిటీలో యథావిధిగా ఉపయోగించిన పదాలే. రాజధానిని మూడు ప్రాంతాల్లోనూ విభజించమని అందులో పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇవన్నీ ఒకే చోటకే ఎందుకు కేంద్రీకృతం కావాలి? ఏపీకి ఇది వరకటి అనుభవాలు ఎలాంటివి? చెన్నై, హైదరాబాద్ విషయంలో ఏం జరిగింది? చరిత్ర మనకేం చెబుతోంది? గతం నుంచి పాఠాలు నేర్చుకోలేమా?
అభివృద్ధి అంటే సెక్రటేరియట్, అసెంబ్లీ, హై కోర్టు కాదంటున్నారా.. అయితే ఇక సమస్య ఏమిటి? సోకాల్డ్ సిటీని డెవలప్ చేయడానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వ హయాంలో పేపర్స్ ను ప్రిపేర్ చేశారు. దాని కోసమని 33 వేల ఎకరాలను సేకరించారు. ఐదు వందల ఎకరాలు రాజధానికి సరిపోతాయని శివరామకృష్ణన్ కమిటీ చెబితే.. అంత భూమి ఎందుకు సేకరించినట్టు? ల‌్యాండ్ డీల్స్ గురించి సిట్ ధర్యాప్తు జరుపుతూ ఉంది. బినామీ బాగోతాలను బయటపెట్టబోతున్నాం. అసలు రాజధాని ప్రకటనే ఒక పెద్ద స్కామ్. అది కేవలం ఒక రియలెస్టేట్ బిజినెస్ లా జరిగింది.
కేరళలో ఎన్ని మేజర్ సిటీస్ ఉన్నాయి? ఒక్కటీ లేవే! కొన్ని పారామీటర్స్ లో కేరళ దేశంలోనే చాలా రాష్ట్రాల కన్నా ముందుంది! అభివృద్ది అనేది రాష్ట్రమంతటికీ పంచాలి. విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి, మధ్య ఆంధ్ర.. వీటన్నింటికీ డెవలప్ మెంట్ క్లస్టర్స్ గా తయారయ్యే అవకాశాలున్నాయి.
చంద్రబాబు పై కోపంతో అమరావతిని తక్కువ చేస్తున్నారా.. మీ పాలనను టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది కదా, మీరు వారిపై నిఘా పెట్టారని కూడా ఆరోపణలు చేస్తున్నారు..
ఇది అర్థం లేని ఆరోపణ. మేం అమరావతి పై ఎందుకు కక్ష పెంచుకుంటాం? మేము రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. అమరావతిని మేం వదిలివేయడం లేదు. అమరావతి నుంచినే లెజిస్లేటివ్ విభాగం పని చేస్తుంది. మనదేశంలో ఏ విషయంలోనూ రిఫరండం ప్రక్రియను అనుసరించరు. ఒకవేళ అమరావతి విషయంలో రిఫరండం అంటూ పెడితే.. అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? కాబట్టి మనం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటాం. ఏ విషయంలో అయినా ప్రజాభిప్రాయ సేకరణ చేయరు కాబట్టి, నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వెళ్తుంటాం. వాళ్ల అభిప్రాయాలను ఎందుకు గౌరవించరు? రిఫరండం పెడితే మూడు ప్రాంతాల ప్రజలూ మా ఆలోచనతో ఏకీభవిస్తారు. ఆ పద్ధతి మన దగ్గర లేదు కాబట్టి.. నిపుణుల అభిప్రాయల మేరకు వెళ్తున్నాం.
శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. అలాగే మేం మా కమిటీ ని నియమించాం. ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నాం. కేంద్రీకృతమైన మోడల్ కన్నా మంచి మోడల్ తో ముందుకు వెళ్తాన్నాం. మెగా సిటీస్ అవసరం లేదు, కేవలం వనరులను దెబ్బతీసుకోవడానికి, ప్రజలపై భారం మోపడానికే అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. అన్ని జిల్లాల్లోనూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ఇలాంటివి మా లక్ష్యాలు.
ఇక చంద్రబాబు చేసిన నిఘా ఆరోపణ అర్థం లేనిది. అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని డీజీపీ కోరారు. అదే మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించడం గురించి ఆధారాలను కూడా చూపించాం. అయినా స్పందించలేదు.
మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థే. వాళ్లిద్దరూ ఒకేసారి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా కూడా చెప్పేవారు. ఒకప్పుడు వారు ఒకే పార్టీ, సన్నిహితులు కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలను పక్కన పెట్టి, ప్రజలు విపత్తులను ఎదుర్కొంటున్న వేళ అయినా రాజకీయ నేతలు కలిసి కట్టుగా పని చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందంటారా?
వాళ్లు ఒకే అంశానికి కట్టుబడ్డారు. అమరావతిలో పెట్టిన పెట్టుబడులను కాపాడుకోవాలి. అంతకు మించి వారికి మరో అజెండా లేదు. గత 15 నెల్లలో ఆయన అమరావతి గురించి తప్ప మరేం మాట్లాడటం లేదు. అమరావతి గురించి చర్చించాల్సింది ఏమీ లేదు. ఆ విషయం గురించి ఇప్పటికే ఆ విషయంలో స్పష్టంగా చెప్పాం. అభివృద్ధి వికేంద్రీకరణకే మా మొగ్గు. మీరు, మీ సన్నిహితులు ఒక చోట భూములు కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడ మాత్రమే అభివృద్ధి జరగాలని అనడం భావ్యం కాదు. ఇక కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో చంద్రబాబు నాయడు ఏపీలో అడుగు కూడా పెట్టలేదు!
కాంగ్రెస్ పార్టీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? గాంధీయేతర కుటుంబీకులు ఆ పార్టీ పగ్గాలు చేపడితే ఆ పార్టీ మనుగడ సాగించగలదంటారా?
మాది ప్రాంతీయ పార్టీ. మా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది. లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీ అయినప్పటికీ జాతీయ పార్టీలను, రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేము. మా రోల్ రాష్ట్రం పరిధి వరకే పరిమితం. విభజనతో అన్యాయానికి గురైన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే మా బాధ్యత. మేం స్టేట్ ను రీ బిల్డ్ చేసుకోవడంలో ఉన్నాము. జాతీయ రాజకీయాలు మా ప్రాథమ్యాలుగా లేవు.
బీజేపీతో మీ సమీకరణాలు ఎలా ఉన్నాయి? పార్లమెంట్ లో మీరు తరచూ ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఆ పార్టీకి మిత్రపక్షమా లేక అంశాల వారీగా మద్దతా?
రాష్ట్ర ప్రయోజనాలే మా బాధ్యత. వాటిని దృష్టిలో ఉంచుకునే ముందుకు సాగుతూ ఉంటాం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధ్యం అవుతుందని మేం నమ్ముతున్నాం. ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు ముందు ముందు అయినా జరుగుతుందని భావిస్తున్నాం. ఆ విషయంలో మేం ఆశావాదులం. అంశాల వారీగా కేంద్రానికి మద్దతు ఉంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నాం. రాజకీయంగా కూడా ఆ పరిధి మేరకు వ్యవహరిస్తున్నాం.