జగన్ సర్కార్ తన తొమ్మిది నెలల కాలంలో చేసిన తెలివైన పనేంటి అని ప్రశ్నిస్తే ఈఎస్ఐలో భారీ కుంభకోణాన్ని వెలికి తీయడమే అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకాలం ఈ విషయమై ఎక్కడా ఒక్క మాట కూడా బహిరంగ ఆరోపణలు, చర్చ లాంటివేవీ జరగలేదు. తెలంగాణల ఈఎస్ఐలో భారీ అవినీతి స్కాం బయటపడటం…ఏపీలో కూడా అలాంటిది ఏమైనా జరిగి ఉంటుందేమోననే అనుమానం ప్రభుత్వానికి వచ్చింది. వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టడం, అవినీతిని ఆధారాలతో సహా వెల్లడించడం చకాచకా జరిగిపోయాయి.
తెలివైన ప్రభుత్వం మాటలు మాట్లాడదు. చేతల్లో చూపుతుంది. ఇప్పుడు జగన్ సర్కార్ అదే పని చేసింది. ఇదే రాజధాని భూముల్లో అవినీతిపై గత తొమ్మిది నెలలుగా పెద్ద ఎత్తున ఆరోపణలకే సమయం వెచ్చించారు. అంతే తప్ప అవినీతిని నిరూపించిన దాఖలాలు లేవు. కానీ గత రెండు నెలలుగా రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ప్రభుత్వం ముందడుగు వేసింది. రకరకాల విచారణ కమిటీలను వేయడం, నివేదికలు తెప్పించుకోవడం తెలిసిందే.
ప్రస్తుతం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దూకుడుగా వ్యవహరిస్తుండటం, ఈడీ కూడా ప్రవేశించడం తెలిసిందే. ఈఎస్ఐ అవినీతి విషయానికి వస్తే వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్‌పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నిర్భయంగా లేఖ రాయడం బహిర్గతమైంది. ఈయనతో పాటు మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా అవినీతిని కొనసాగించడం కూడా వెల్లడైంది.
తెలంగాణ ఈఎస్‌ఐ స్కామ్‌లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను అక్కడి ప్రభుత్వం జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆంధ్రాలో బయటపడుతున్న ఈఎస్ఐ అవినీతి బాగోతం కేసులో కూడా మాజీ మంత్రులతో సహా అధికారులు, ఇతరత్రా సిబ్బంది కూడా జైలుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారంటే ఈఎస్ఐలో ఎంతగా స్కామ్ జరిగిందో అర్థమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచుకున్న వారి భరతం పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయం భవిష్యత్‌లో, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి.