ఇదేమీ గాసిప్ కాదు, ఉత్తుత్తిగా చెప్పుకునే మాట కాదు, యూట్యూబ్ చానళ్లలో ప్రసారం అయ్యే గ్యాస్ కాదు.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్. అందులో సంచలన అంశాలను పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఆ సంచలన అంశాలు రకరకాల చర్చకు దారి తీస్తూ ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది.. ఇన్నాళ్లూ రఘురామది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎందుకో మొదలైన తీవ్రమైన కోపం అనుకున్నారు. ఈ మధ్యనే రఘురామకృష్ణంరాజుకు సన్నిహితుడిగా పేరుపొందిన ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇదంతా ఇగో వార్ అన్నట్టుగా స్పందించారు.
దానికి ఏకంగా మహాభారతానికి తనకు తోచిన వ్యాఖ్యానం చెప్పారు ఉండవల్లి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు రఘురామల అహంకారపూరిత వైఖరి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఉండవల్లి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలదీ అహంకారమే అని సూత్రీకరించారు.
మరి అదే అనుకుంటే.. ఇప్పుడు ఈ వ్యవహారంలో డబ్బుల గోల కూడా ఉందని అంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఏకంగా సుప్రీం కోర్టుకు అఫడవిట్ ను అందించింది. ఏ గాసిప్పుల ఆధారంగానో ప్రభుత్వం అఫిడవిట్ ను పొందు పరిచే అవకాశం ఉండదు.
ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ అరెస్టు సమయంలో ఫోన్ వ్యవహారం కూడా చర్చలో నిలిచింది. ఆ ఫోన్ పాస్ వర్డ్ కోసమే రఘురామను పోలీసులు కొట్టారంటూ అప్పట్లో రచ్చ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఫోన్ వ్యవహారం తెర మీదకు వస్తోంది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కు పూర్తి ఆధారం ఆ ఫోన్ అని, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అందులోని వివరాలను బయటకు తీసి, ధ్రువీకరించున్నట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలనే ఇప్పుడు సుప్రీం కోర్టుకు సమర్పించినట్టుగా స్పష్టం అవుతోంది.
పది లక్షల యూరోల మొత్తం టీవీ ఫైవ్ నాయుడు నుంచి రఘురామ అకౌంట్ కు బదిలీ అయ్యాయని, చంద్రబాబు నాయుడు- లోకేష్ లు వాట్సాప్ ద్వారా రఘురామతో చాట్ చేశారని.. వీళ్లంతా ఆ ప్రెస్ మీట్ వ్యూహకర్తలు అని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ఇలా జాయింటుగా ప్రభుత్వంపై విషం చిమ్మే యత్నం జరిగిందని కోర్టుకు విన్నవించింది ఏపీ ప్రభుత్వం.
తను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీనేనంటూ, తనను ఆ పార్టీ పార్లమెంటరీ విభాగం భేటీకి పిలవలేదంటూ.. ఒకవైపు గోల పెడుతూ, మరోవైపు ఆ పార్టీ పై దుమ్మెత్తి పోస్తున్నారు ఆర్ఆర్ఆర్. అయితే ఆయన ఫోన్ మాత్రం వేరే గుట్టునంతా బయటపెట్టినట్టుగా ఉంది.
ఏపీ ప్రభుత్వానికి ఆయన ఫోనే ఇప్పుడు ఆయుధంగా మారినట్టుగా ఉంది. ఈ పరిణామాల మధ్యన అరెస్టు తర్వాత రఘురామ చూపిందంతా మేకపోతు గాంభీర్యమే అని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. మరి కోర్టులో ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో!