ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటనపై అత్యంత ఉత్కంఠ నెలకుంది. ఆయన ఏం మాట్లాడ్తారోనని ఏపీ ప్రజానీకం అసెంబ్లీ సమావేశాలపై కన్నార్పకుండా చూస్తోంది.
మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ చెప్పిన నేపథ్యంలో జగన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అసెంబ్లీ సమావేశాలు లంచ్ తర్వాత రెండు గంటలకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మొదటగా మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో వివరించారు.
అనంతరం అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ తన జిల్లాలో చోటు చేసుకున్న వరద బీభత్సం గురించి సభ దృష్టికి తీసుకొచ్చారు.
వరద ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నది ఇదే. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటుండంతో పాటు దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేస్తారని హైకోర్టులో ఏపీ చెప్పిన నేపథ్యంలో అంతా ఆయన వైపు చూస్తున్నారు.
మరి జగన్ మనసులో ఏముంది? మమూడు రాజధానులపై మారిన వైఖరి ఏంటి? సమస్య తొలగుతుందా? కొత్తది సృష్టిస్తారా? తదితర అనేక అంశాలు చర్చకొస్తున్నాయి. తినబోతూ రుచి చూడడం దేనికి… జగన్ కీలక ప్రకటన కోసం మనం కూడా ఎదురు చూద్దాం.