ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయత్నం ఫలితాన్నిస్తుందా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీల వివాదానికి ఇటీవలే పరిష్కారం లభించింది. ఈ పరిష్కారంతో తెలంగాణ ఆర్టీసీకి ఏటా 300 కోట్ల మేర లాభం, ఏపీ ఆర్టీసీకి ఏటా 270కోట్ల రూపాయల నష్టం వస్తుందని…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీల వివాదానికి ఇటీవలే పరిష్కారం లభించింది. ఈ పరిష్కారంతో తెలంగాణ ఆర్టీసీకి ఏటా 300 కోట్ల మేర లాభం, ఏపీ ఆర్టీసీకి ఏటా 270కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనా వేశారు అధికారులు. 

తెలంగాణ పరిధిలో ఏపీ బస్సులు తిరిగే రూట్లలో ఏకంగా లక్ష కిలోమీటర్లకు పైగా కోత పడటం, బస్సుల సంఖ్య తగ్గించాల్సి రావడంతో నష్టం అనివార్యం అనుకున్నారు. 

అయితే ఏపీఎస్ఆర్టీసీకి అది మరో రకంగా వరంగా మారింది. తెలంగాణలో కోల్పోతున్న లక్ష కిలోమీటర్ల పరిధిని ఏపీలోనే కవర్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్న అధికారులు రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసుల్ని పెంచబోతున్నారు.

ఇప్పటి వరకు ఇలా..
విజయవాడ-విశాఖ రూట్ తీసుకుంటే.. ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ ఈ లైన్లో రోజూ 107 సర్వీసులు నడిపేది. ప్రైవేట్ ట్రావెల్స్ 117 సర్వీసులు నడిపేవారు. టికెట్ రేట్ తక్కువ కావడంతో ముందు అందరూ ఆర్టీసీవైపే చూస్తారు. బస్సులో సీట్లు లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తారు. 

ఆర్టీసీ కంటే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతున్నాయంటే అక్కడ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత డిమాండ్ ఉన్నా కూడా.. అధికారుల ఉదాసీనత, బస్సులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది.

ఇకపై ఇలా..
ఇప్పుడు తెలంగాణకు వెళ్లాల్సిన బస్సులన్నిట్నీ రాష్ట్రంలోని ప్రధాన రూట్ లో తిప్పాలనుకుంటోంది ఆర్టీసీ.  విజయవాడ-తిరుపతి రూట్ లో కూడా ప్రధానంగా బస్సు సర్వీసులు పెంచాలనుకుంటోంది. 

విశాఖ పాలనా రాజధానిగా పూర్తిస్థాయిలో రూపాంతరం చెందితే.. విజయవాడ-విశాఖ సర్వీసుల్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి న్యాయరాజధాని కర్నూలు వెళ్లే బస్సుల్ని కూడా పెంచాలి. దీంతోపాటు టీఎస్ఆర్టీసీకి పోటీగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల సంఖ్యను కూడా పెంచాలనుకుంటోంది.

తెలంగాణకు పంపించాల్సిన బస్సుల సంఖ్య తగ్గించుకున్నా.. వాటిని ఏపీలో ఇతర రద్దీ మార్గాల్లో తిప్పడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు కూడా పూర్తి స్థాయిలో చెక్ పెడితే.. తెలంగాణ నుంచి కోల్పోయిన ఆదాయం కంటే రెట్టింపు మన రాష్ట్రం నుంచే సంపాదించొచ్చు.

అయితే ఈ నష్ట నివారణ చర్యల్ని ఎంత సమర్థంగా అమలు చేస్తారనే అంశంపై ఆర్టీసీ ఆర్థిక పురోగతి ఆధారపడి ఉంటుంది. మరోసారి అవినీతి-అలసత్వానికి తావిస్తే, ఈసారి ఆర్టీసీని ప్రభుత్వం కూడా కాపాడలేదు.

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్