అర్నబ్ గోస్వామి అరెస్టును మీడియాపై దాడిగా అభివర్ణిస్తున్నారు. అది నిష్టూరమైన నిజం కూడా. ఒకవేళ మహారాష్ట్ర సర్కారుపై అర్నబ్ గోస్వామి తీవ్రంగా ధ్వజమెత్తకుంటే ఆయనపై నమోదైన పాత కేసు ఇప్పుడు తెరిచే అవకాశం ఉండేది కాదేమో! అయితే.. ఈ వ్యవహారాన్ని గమనిస్తే ఒక పాత కథ గుర్తొస్తుంది.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? అందట ఒక చీమ! చేపా చేపా ఎందుకు ఎండలేదు? అంటే.. గడ్డిమోపు అడ్డమొచ్చినందుకు అనే కాజ్ ను చెప్పినట్టుగా ఉంటుంది ఈ వ్యవహారం! అర్నబ్ గోస్వామిపై ఠాక్రే సర్కారు కత్తి గట్టింది. ఆ కత్తి ఎందుకు గట్టింది? అంటే.. బీజేపీయేతర సర్కారులపై అర్నబ్ గోస్వామి కత్తి గట్టినందుకు.. అన్నట్టుంది ఉంది ఈ వ్యవహారం.
బీజేపీ యేతర సర్కారుల నిర్ణయాలను, బీజేపీ యేతరుల పాలనలో ఉన్న రాష్ట్రాల గురించి అర్నబ్ గోస్వామి స్పందించే తీరు, అక్కడ చీమ చిటుక్కుమన్న బ్రహ్మాండం బద్ధలైనట్టుగా ఆయన నిర్వహించే డిబేట్లు..ఇవన్నీ సామాన్య జనం కూడా ఛీత్కరించుకునే స్థాయిలో ఉంటాయి.
టైమ్స్ నౌలో ఉన్నప్పుడు అర్నబ్ చర్చా కార్యక్రమాలు ఒక హద్దుల్లో అయినా ఉండేవి, రిపబ్లిక్ టీవీ ఏర్పాటయ్యాకా ఆ చర్చా కార్యక్రమాల్లోనే ఎగిరిగంతులేస్తూ ఉంటారాయన. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను టైమ్స్ నౌ చానల్, రిపబ్లిక్ టీవీలు పోటాపోటీగా రాజకీయం చేశాయి.
బాలీవుడ్ ను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ దుమ్మెత్తిపోశాయి. విచారణ అంటూ ఒకటి జరుగుతున్నా.. అది సాక్షాత్ సీబీఐ విచారణే అయినప్పటికీ.. సుశాంత్ ను ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు హత్య చేయించారనేంత స్థాయిలో సదరు చానళ్లలో చర్చా కార్యక్రమాలు పెట్టించారంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఆదిత్య ఠాక్రేతో, రియా చక్రబర్తి తిరుగుతున్నట్టుగా ఫేక్ ఫొటోలను కొంతమంది ప్రచారంలోకి తీసుకురాగా.. ఆ స్థాయికి తగ్గట్టుగా కొన్ని టీవీ చానళ్లలో చర్చాకార్యక్రమాల్లో చర్చ నడిచింది. దీనిపై రిపబ్లిక్ టీవీకి శాసనసభ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఉద్ధవ్ ఠాక్రే ను కించపరుస్తూ చర్చా కార్యక్రమం నిర్వహించడంపై మహారాష్ట్ర అసెంబ్లీ రిపబ్లిక్ టీవీకీ, అర్నబ్ గోస్వామికి నోటీసులు ఇచ్చింది. సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టుగా పేర్కొంది. దీనిపై అర్నబ్ సుప్రీం కోర్టుకు ఎక్కారు!
అంటే.. అర్నబ్ లాంటి వాళ్లు అలా అడ్డగోలుగా బురద జల్లుతూ ఉంటే, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు కడుక్కొంటూ ఉండాలనమాట! సుశాంత్ మరణాన్ని ఎందుకు రాజకీయం చేశారు.. అంతిమంగా ఆ విషయంపై ఏం తేలిందనేది అందరికీ తెలిసిన విషయమే.
సుశాంత్ ది ఆత్మహత్య అని ఎయిమ్స్ బృందం తేల్చి చెప్పింది. సీబీఐ, ఈడీలు కూడా ఈ కేసులో విచారణలో ఎలుకను పట్టలేకపోయాయి. అయితే రిపబ్లిక్ టీవీ మాత్రం.. సుశాంత్ ఆత్మహత్యపై ఉద్ధవ్ ఠాక్రేపై బురద జల్లింది! .
ఎంత మీడియా అయితే మాత్రం ఒక హద్దంటూ ఉండనక్కర్లేదా? ఆల్రెడీ తాము కోరుకున్న రాజకీయ ప్రయోజనాల కోసం.. తిమ్మిని బమ్మిని చేస్తూ, నోరేసుకుని విరుచుకుపడుతున్నాకా.. ఇక వాళ్లను జర్నలిస్టుగా సాధారణ ప్రజలు భావిస్తారా? మీడియా రాజకీయం చేస్తోంది, మహారాష్ట్ర ప్రభుత్వమూ రాజకీయం చేస్తున్నట్టుంది.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనాలా? దెబ్బకు దెబ్బ అనాలా?