బుల్లితెర, వెండితెరలపై కాలానికి తగ్గట్టు కమెడియన్లు వస్తున్నారు. తమదైన స్టైల్‌లో నటిస్తూ, హాస్యాన్ని పండిస్తున్నారు. వెండి తెరపై బ్రహ్మానందం, బుల్లితెరపై హైపర్ ఆది… కామెడీ చేయడంలో, పంచ్ డైలాగ్‌ల డెలవరీలో ఎవరికి వారే సాటి అని చెప్పొచ్చు. అయితే రాజకీయ తెరపై మనకు కామెడీ యాక్టర్లకు కొదవ లేదు. ఈ జాబితాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ చేరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం నడుస్తున్న నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్ స్పందిస్తూ ఇది డ్రామానా? నిజమా? అనే కామెంట్స్ చేసి అభాసుపాలయ్యారు. ఇది గ్రహించకుండా నాదెండ్ల మనోహర్ తమ అధ్యక్షుడికి మించి కామెడీ చేయడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న జలవివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి, నిజాయతీ వుంటే తన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. హక్కుగా రావాల్సిన నీటి కోసం సీఎం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ఆయన నిలదీశారు. ఒక వైపు సొంత కుటుంబంలోని వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన వైఖరి చెప్పడం ఏంటో నాదెండ్లకే తెలియాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకం చెప్పి వెనుకబడిన రాయలసీమకు నీళ్లు తరలించుకుపోతున్నారని తెలంగాణ గొడవ చేస్తుంటే… ఇక జగన్ తన వైఖరి ఏ విధంగా చెప్పాలో నాదెండ్ల చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమ నుంచి వచ్చిన జగన్‌కు ఆ ప్రాంతం సాగునీటికి నోచుకోక పడుతున్న ఇబ్బందుల గురించి తెలిసిన వాడు కావడం వల్లే బృహత్తర సాగునీటి పథక రచన చేశారు.
జగన్‌ను రాజకీయంగా ఎన్నైనా విమర్శించొచ్చు. కానీ రాయలసీమ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు చేపట్టిన జగన్‌కు ప్రతిపక్షాలు మద్దతు నిలవకపోగా, అర్థంపర్థం లేని ప్రశ్నలు వేస్తూ …తమ అజ్ఞానాన్ని, అక్కసును ప్రదర్శిస్తున్నాయనే అభిప్రాయాలకు నాదెండ్ల వ్యాఖ్యలు నిదర్శనమని చెప్పొచ్చు.
ఇంతకూ కృష్ణా జలాలపై జనసేన వైఖరి చెప్పడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో నాదెండ్ల ప్రకటిస్తే సరిపోతుంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి, అడ్డుకోవడం ఆ పార్టీకే చెల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.