ఎన్నికలు అయిన ఏడు నెలల వరకూ బయటకు కనిపించని విజయనగరం రాజావారిని బయటకు తెచ్చిన ఘనత అచ్చంగా జగన్ దే మరి. నిజానికి కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన దగ్గర నుంచి పూసపాటి అశోక్ గజపతి రాజులో చురుకుదనమే తగ్గిపోయింది. ఎటూ ఓడాం కదా అని పార్టీ కాడిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు.
మరోవైపు మూడు రాజధానుల ప్రకటనతో జగన్ టీడీపీని గట్టిగానే టార్గెట్ చేశారు. విశాఖలో రాజధాని అంటూ జగన్ ప్రతిపాదించేసరికి ఉత్తరాంధ్రా జిల్లాల్లో రాజకీయ పునాదులు కదులుతాయని భయపడిన చంద్రబాబు మొత్తానికి అశోక్ ని హైదరాబాద్ నుంచి ఆయన ఇలాకాకు రప్పించేసారు.
మూడు రాజధానులకు అనుకూలంగా సంతకాల సేకరణ పేరిట తమ్ముళ్ళతో పాటు తాను చేయి వేసిన అశోక్ జగన్ మీద మాటల దాడి చేశారు. అమరావతిని మరో కాశ్మీర్ చేశారంటూ కొత్త పోలిక తెచ్చారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడాలేదంటూ బాబు మీద సానుభూతి చూపించారు. నిజమే కానీ ఇంతకీ రాజు గారికి విశాఖ రాజధాని ఇష్టం ఉందా లేదా మాత్రం చెప్పడంలేదు.
పైగా ఆయనకు అమరావతి రాజధాని కాశ్మీర్ లా కనిపించడం మరో విడ్డూరం. ఇదేం పోలిక రాజు గారూ అని తమ్ముళ్ళే అయోమయంలో పడేలా ఆయన వైఖరి ఉంది. మరో వైపు పక్కనే విశాఖ ఎయిర్ పోర్టులో ఇదే రాజు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు నాటి ప్రతిపక్ష నేత జగన్ని అరెస్ట్ చేయించారు.
మరి నాడు ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయించడం దేశంలోనే ఎక్కడా జరగలేదని రాజు గారికి అనిపించలేదేమో. మొత్తానికి బాబు బతిమాలారో, రాజుగారికే సరదా పుట్టిందో మళ్ళీ యాక్టివ్ గా రాజకీయం చేయాలనుకుంటున్నట్లుగా సీన్ కనిపిస్తోంది.
అయితే తాము అధికారంలో ఉండగా విజయనగరం జిల్లాను కనీసం పెద్ద పల్లెటూరు స్థాయి నుంచి పట్నానికి కూడా ఎదగనీయకుండా చేసిన నాయకులు విశాఖలో రాజధాని పెడతామంటే మాత్రం తగుదునమ్మా అంటూ అడ్డం పడుతున్నారని సొంత జిల్లా నుంచే సెటైర్లు పడుతున్నాయి.
అమరావతే మన రాజనైధాని అంటూ బాబు చెప్పినట్లుగా తలూపుతున్న తమ్ముళ్ళు నిజంగానే జనంలోకి వెళ్ళి సంతకాల సేకరణ చేస్తున్నారా, లేక తామే ఒకటికి పదిసార్లు సంతకాలు పెడుతున్నారా అంటూ వైసీపీ నేతలు వేసే పంచులకు రాజుగారే జవాబు ఇవ్వాలి మరి.