అక్కడ అచ్చెన్న బలిపశువు.. ఇక్కడ లోకేష్ సేఫ్ గేమ్

ఏపీలో మిగిలిపోయిన మున్సిపాల్టీలకు జరిగిన స్థానిక ఎన్నికలు ముగిశాయి. 12 మున్సిపాల్టీలు ఒక నగర కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా నగర కార్పొరేషన్ పై…

ఏపీలో మిగిలిపోయిన మున్సిపాల్టీలకు జరిగిన స్థానిక ఎన్నికలు ముగిశాయి. 12 మున్సిపాల్టీలు ఒక నగర కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా నగర కార్పొరేషన్ పై ప్రధానంగా దృష్టిపెడుతుంది. కానీ ఏపీలో సీన్ రివర్స్. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి సమానంగా ఓట్లు సాధించింది. 

అక్కడ వైసీపీ మెజార్టీ కేవలం 2వేలు. అంటే కష్టపడితే నెల్లూరులో కాస్తో కూస్తో పరువు నిలుపుకునే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ నెల్లూరుకి మొహం చాటేశారు. కుప్పం జపం చేశారు. నోటిఫికేషన్ కు ముందు చంద్రబాబు, నోటిఫికేషన్ తర్వాత మాజీ మంత్రులు, చివర్లో లోకేష్.. ప్రచారంతో హోరెత్తించారు.

నెల్లూరు కోసం అచ్చెన్నాయుడు..

2019 నాటికి ఇప్పటికి నెల్లూరులో చాలా మార్పులొచ్చాయి. బలమైన కేడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లుండగా ఒక్కటంటే ఒక్క చోట కూడా టీడీపీ గెలవలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఫస్ట్ రౌండ్ తోనే ఫలితాలు తేలిపోయాయి. 

సెకండ్ రౌండ్ లో లెక్కించాల్సిన ఓట్ల కంటే.. వైసీపీ మెజార్టీలే ఎక్కువగా వచ్చాయి. అంటే ఏ దశలోనూ టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది. అయితే నెల్లూరులో అచ్చెన్నాయుడు, చినరాజప్ప.. వంటి మాజీ మంత్రులంతా ప్రచారానికి వచ్చారు. ముఖ్యంగా అంతా అచ్చెన్నాయుడు కనుసన్నల్లోనే అంతా జరిగింది. దీంతో ఇప్పుడు అచ్చెన్న అందరికీ టార్గెట్ అయ్యారు.

చంద్రబాబు అసంతృప్తి..

నెల్లూరు కార్పొరేషన్లో ఒక్క డివిజన్ కూడా గెలుచుకోకపోవడం నేతల అసమర్థతేనని చంద్రబాబు అన్నారట. ఎమ్మెల్యే లేని చోట కూడా దర్శి మున్సిపాల్టీని గెలిపించుకున్నామని, మిగతా అన్ని చోట్ల కాస్తో కూస్తో పోటీ ఇచ్చామని.. కనీసం నెల్లూరు కార్పొరేషన్లో ఒక్క డివిజన్ లో కూడా గెలవలేకపోవడం దారుణం అని బాబు విశ్లేషించారట. ఫైనల్ గా తప్పంతా అచ్చెన్నాయుడిపై పడేసరికి.. ఆయన కూడా నొచ్చుకున్నాడని తెలుస్తోంది.

బాబుకిది అలవాటే..

కుప్పంలో గెలుపుపై ధీమా ఉందని చెప్పుకునే చంద్రబాబు.. నెల్లూరులో ప్రచారానికి ఎందుకు రాలేదు, కనీసం లోకేష్ ని అయినా ఎందుకు పంపించలేదు. అక్కడ పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని సర్వేలు తేల్చడంతో అచ్చెన్నాయుడిని బలిపశువుని చేసేందుకు పంపించారు. అన్నీ మీరే చూడండి అంటూ ఆదేశించారు, చివరకు ఫలితాలొచ్చాక విమర్శలు మొదలు పెడుతున్నారు.

బాబుకి ఇలాంటి వ్యవహారాలన్నీ బాగా అలవాటు, ఓటమికి ఎవరో ఒకర్ని ముందుగానే బుక్ చేసేందుకు రెడీగా ఉంచుతారు. గతంలో హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెలంగాణలో కూకట్ పల్లి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఓడిపోతామని తెలిసినా కూడా తెలంగాణ టీడీపీకి నువ్వే దిక్కంటూ ఆమెను బలిపశువుని చేశారు. కంటితుడుపుగా ప్రచారానికి వెళ్లి సుహాసిని ఓడిపోయిన తర్వాత ఆమె మొహం కూడా మళ్లీ చూడలేదు.

గుర్రుగా ఉన్న అచ్చెన్న..

నెల్లూరు వ్యవహారంలో అచ్చెన్నాయుడు కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఓడిపోతారనుకున్న కార్పొరేషన్ కి తనను పంపించి, స్థానికంగా బలమైన అభ్యర్థులు కూడా లేకుండా ప్రచారానికి వెళ్లమని చెప్పారని, కనీసం చంద్రబాబు, లోకేష్ ఒక్కసారి కూడా అక్కడికి రాలేదని సన్నిహితుల దగ్గర వాపోయారట. నెల్లూరు అవమాన భారాన్ని తన ఒక్కడిపైనే వేయడం సరికాదని అంటున్నారట.