ఆయోధ్యలో ఆలయ నిర్మాణానికి అంటూ.. జోలె పట్టినప్పుడే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎక్కడిక్కడ ఎవరికి వారు కాషాయం గట్టి వసూలు చేసుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విరాళాల వ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలందుకున్నాయి. విరాళాల సేకరణలో బాధ్యతాయుతమైన సంస్థలకు స్థానం ఉండాలని అంతా కోరుకున్నారు. ఇక రామాలయ నిర్మాణానికి చందాల సంగతలా ఉంటే.. ఇప్పుడు అక్కడ ఒక భూమి కొనుగోలు వ్యవహారం దుమారం రేపుతూ ఉంది.
ఆలయానికి భూమి కొనుగోలు అంశం కొందరి చేతులు మారిందని, గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయల ధరను పెంచారని, హెచ్చు ధరకు ఆలయ నిర్మాణ ట్రస్టు దాని కొనుగోలు చేసిందనే అంశం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణం అంశం పై ఉన్న రాజకీయ పోరాటం నేపథ్యంలో.. ఈ స్కామ్ పెను దుమారంగా మారతోంది.
ఈ ఏడాది మార్చి 18వ తేదీన 1200 చదరపు అడుగుల భూమిని రవి పాటక్ అనే వ్యక్తి రవి, అన్సారీ అనే ఇద్దరికి రెండు కోట్ల రూపాయల ధరకు అమ్మాడు. అదే రోజున కేవలం కొన్ని నిమిషాల తర్వాత ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి రామజన్మభూమి తీర్థ క్షేత్ర టస్టు అదే భూమిని ఏకంగా 18.5 కోట్ల రూపాయల వ్యయానికి కొనుగోలు చేసింది. కేవలం నిమిషాల వ్యవధిలో భూమి ధర ఆ స్థాయిలో పెంచడం వెనుక పెద్ద స్కామ్ ఉందనే ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి.
ఈ భూమి కొనుగోలులో ట్రస్టులో సభ్యులైన బీజేపీ నేతల సంతకాలున్నాయని తెలుస్తోంది. వారి కనుసన్నల్లోనే ఈ కొనుగోలు జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఆలయ నిర్మాణానికి అంటూ చందాలను పోగు చేసి ఇలా స్కామ్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర విమర్శలకు దిగాయి.
మరోవైపు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కూడా ఈ పోకడపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఆయోధ్య ఆలయ నిర్మాణాన్ని వ్యాపారంగా మలుచుకున్నాయని అవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.