“బీసీల గొంతు నొక్కేస్తున్నారు, బీసీ నాయకత్వాన్ని అణచి వేస్తున్నారు, బీసీలను టార్గెట్ చేస్తున్నారు..” ఇవీ కొన్నిరోజులుగా టీడీపీ నాయకులు వల్లెవేస్తున్న మాటలు. అచ్చెన్నను అరెస్ట్ చేస్తే బీసీలన్నారు, యనమలపై కేసు పెడితే బీసీలన్నారు, అయ్యన్నపాత్రుడ్ని అణచివేస్తున్నారని రచ్చచేశారు. చివరకు మాజీ మంత్రి కొల్లు రవీంద్రని హత్యకేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. దీనికి కూడా బీసీ ముసుగు వేసేశారు.
అసలింతకీ బీసీలపై కోపం జగన్ కా.. లేక చంద్రబాబుకా అర్థంకాని పరిస్థితి. ఒకరు హత్యకేసులో ముద్దాయి, మరొకరు అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్నారు, ఇంకొకరు ఈఎస్ఐ స్కామ్ లో కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేసిన పెద్ద చేప. వీరందరిలో కామన్ పాయింట్ ఒక్క బీసీయేనా. అవినీతి, అక్రమాలు కాదా. లోకంలో ఎవరూ తప్పులు చేయనట్టు, తప్పులు చేసి దొరికిపోయినవారంతా బీసీలే అయినట్టు.. పరోక్షంగా బీసీల పరువు తీస్తోంది టీడీపీ.
వాహనాల తప్పుడు రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్ట్ అయిన జేసీ బ్రదర్ సంగతేంటి? ఆయన బీసీ కాదు కదా? మరి ఆయన్ను టీడీపీ ఎందుకు కలుపుకోవడం లేదు. తనకి అవసరమైనవారిని మాత్రమే ఓ గ్రూప్ గా చేసుకుని, బీసీలను వైసీపీ అణచి వేస్తోందంటూ మొసలి కన్నీరు కారుస్తూ.. బీసీ వర్గాలని రెచ్చగొట్టాలని చూస్తోంది టీడీపీ. అచ్చెన్న విషయంలో ఈ పాచిక పారకపోయినా కొల్లు రవీంద్ర అరెస్ట్ అయిన తర్వాత కూడా అదే బీసీ కార్డు ప్రయోగించి విఫలమైంది.
అసలింతకీ ఈ సోకాల్డ్ బీసీ నేతలకు ఆయా వర్గాల్లో ఏమైనా పలుకుబడి ఉందా? అచ్చెన్నను రాష్ట్రంలో బీసీలు తమ నాయకుడిగా గుర్తించాలా, పోనీ యనమలకి ఏమైనా ఆ క్రెడిట్ ఉందా, లేదా కొల్లు రవీంద్ర బీసీలకేమైనా ఒరగబెట్టారా, లేదా వారి తరపున నాయకుడిగా నిలబడ్డారా? ఇవేవీ చేయని ఆ అక్రమార్కులను బీసీలు ఎందుకు నెత్తినపెట్టుకుంటారు. వారి అవినీతి మరకల్ని బడుగు జాతి మొత్తానికి అంటించాలని చూడటం టీడీపీ దిగజారుడు రాజకీయం కాదా?
నిందితుడు చేసిన తప్పేంటో ముందు ప్రజలకు తెలియాలి కానీ, అరెస్ట్ అయిన వ్యక్తి కులమేంటో కనుక్కుని దానితో రాజకీయం చేయాలనుకునే చెడు సంప్రదాయం చంద్రబాబుతోనే మొదలైందని చెప్పాలి. ఎక్కడ ఏ తప్పు జరిగినా, బీసీలకు అంటగడుతూ.. బీసీలను రాజకీయ సమిధలుగా మార్చాలనుకుంటున్న చంద్రన్న డ్రామాలు ఇక ఎంతమాత్రం సాగవు. నిజంగా బీసీలపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. అరెస్ట్ లకి, కులానికి లింకు పెట్టే నీఛ రాజకీయాల్ని చంద్రబాబు వదిలిపెట్టాలి.