అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు ఉత్సాహంగా సిద్ధమవుతాయి. అధికార పార్టీపై నిప్పులు చెరిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటాయి. మంత్రుల్ని టార్గెట్ చేస్తాయి, ముఖ్యమంత్రి తీరుని ఎండగడతాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీ సమావేశాలంటేనే చంద్రబాబులో గుబులు మొదలైంది.
ఏపీలో రోజు రోజుకీ అధికార పార్టీ వైభవం పెరిగిపోవడం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి అన్ని వర్గాల మద్దతు లభించడం వంటి కారణాలతో టీడీపీకి దిక్కుతోచకుండా ఉంది. అన్నిటికీ మించి 23 స్థానాలకు పరిమితమైన టీడీపీలో జారిపోయిన వారు పోగా.. మిగతా వాళ్లలో నిలదీసే గొంతులు తక్కువయ్యాయి.
వయసు మీద పడిన బుచ్చయ్య, అవినీతి మురికి అంటించుకున్న అచ్చెన్న మినహా మిగతా వారికి గొంతు పెగలడంలేదు. ఇక చంద్రబాబు సంగతి సరేసరి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పైకి లేస్తే చాలు.. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్ లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అందుకే బాబు అసెంబ్లీలో నిలబడ్డానికి కూడా భయపడుతున్నారు.
గత అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబుని కరివేపాకులా తీసి పడేస్తూ చెడుగుడు ఆడుకున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ ఏకంగా స్లైడ్ షో లు వేసి మరీ బాబు బండారాన్ని బైటపెడుతున్నారు. దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు బాబు.
ఇక అసెంబ్లీలో ప్రస్తావించడానికి సమస్యలేవైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కరోనాపై అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉంది ఏపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో పేదలకు ఆర్థిక సాయం అందడంలో బ్రేక్ పడకుండా చూస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేదని అడగాలి, అదేమైనా జాతీయ సమస్యా? పోనీ అమరావతిపై రచ్చ చేయాలని చూస్తే మిగతా మూడు ప్రాంతాల్లో పలుచన అవుతారనే విషయం ఇప్పటికే అర్థమైంది. పెరిగిన ధరలు, ధాన్యం సేకరణ, తుఫాన్ ప్రబావం.. ఇలా ఏవీ టీడీపీకి పనికొచ్చే అస్త్రాలు కానే కావు.
దీంతో టీడీపీలో ఇప్పటినుంచే అంతర్మథనం మొదలైంది. అన్నిటికంటే మించి చేజారిపోతున్న ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీకి మరింత ఆందోళనగా మారింది. ప్రతిసారీ జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఎవరో ఒకరు కొత్తగా టీడీపీ నుంచి వెళ్లిపోతున్నారు.
ఈ దఫా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటునుంచి అటు వెళ్లారు. తాజాగా శీతాకాల సమావేశాల సాక్షిగా ఈసారి టీడీపీ నుంచి ఎన్ని వికెట్లు పడతాయోననే భయం బాబుని పట్టి పీడిస్తోంది.