పిల్లనిచ్చిన మామ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ హీరో దివంగత ఎన్టీ రామారావుకు మాజీ ముఖ్యమంత్రి , ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచి 25 ఏళ్లైంది. సోషల్ మీడియానే లేకపోతే ఈ విషయం తెలిసేది కాదు.
ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు గురించే చెబుతారు గానీ, అంతకు మించి బాబు ద్రోహం గురించి ఏనాడూ మీడియా చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ పత్రికలు కూడా ఆ ద్రోహంలో భాగస్వాములు కాబట్టి. సోషల్ మీడియా రానంత వరకు మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలే. ఆ పత్రికలు రాసినవి, వాటి చానళ్లు కూసినవే నిజాలు.
సోషల్ మీడియా పుణ్యమా అని చంద్రబాబుతో పాటు మీడియా ముసుగులో రామోజీ, రాధాకృష్ణ కలసి ఎన్టీ రామారావుకు ఎంత ద్రోహం చేశారో తెలిసి వస్తోంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ఎంత లోతైన అర్థాన్ని, వాస్తవాల్ని వెలికి తీసిందో తెలిసిపోతుంది.
“చంద్రబాబు తన జీవితం ముగిసిన తర్వాత కూడా వెన్నంటి వుండే రెండు చీకటి ఘటనలు…వెన్నుపోటు, ఓటుకు నోటు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా కూలదోసి, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించి నేటికి 25 ఏళ్లైంది. సరిగ్గా ఇదే రోజు అంటే… 1995, ఆగస్టు 23వ తేదీన ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి చంద్రబాబు నాయకత్వంలో బహిష్కరించారు” అని ఫేస్‌బుక్ పేజీలో కనిపించిన రెండు వాక్యాలు చాలా విషయాలు గుర్తుకు తెచ్చాయి.
టీడీపీని పార్టీ ఆవిర్భావం నుంచి ఆగస్టు సంక్షోభం వెంటాడుతూ ఉంది. 1994లో తిరుగులేని ఆధిక్యతతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. అప్పటికే ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించి ఉన్నారు. దీంతో టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటేమో చంద్రబాబు, రెండోది లక్ష్మిపార్వతి వర్గం. ఇదే అదనుగా తీసుకున్న చంద్రబాబు సీఎం కుర్చీ నుంచి ఎన్టీఆర్‌ను పడగొట్టి అధికా రాన్ని హస్తగతం చేసుకోడానికి కుట్రలు పన్నారు.
1995, ఆగస్టులో సీఎం హోదాలో ఎన్టీఆర్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వైశ్రాయ్ హోటల్ కేంద్రంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చంద్రబాబు క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దింపడం ఒక్కటే మార్గమనే నినాదంతో ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. దీనికి తోడు అప్పట్లో ఇప్పట్లా మరో మీడియా లేదు. ఉన్న మీడియా చంద్రబాబు తొత్తుగా మారింది. దీంతో గోరింతలు కొండంతలు చేస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో కథనాలు రాయడం మొదలు పెట్టారు.
అప్పట్లో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న చంద్రబాబుకు అనుకూలంగా 120 మంది ఎమ్మెల్యేలని ఒకరోజు, ఆ మరుసటి రోజు ఆ సంఖ్య 140కి పెరిగిందని రాస్తూ చంద్రబాబు వైపు వెళ్లకపోతే ఏమవుతుందోననే భయాన్ని టీడీపీ ప్రజాప్రతినిధుల్లో కలిగించడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విజయం సాధించాయి. చివరికి తాము ఎక్కడ వెనుకబడిపోతామో అనే భయంతో ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా బాబు క్యాంప్ కార్యాలయం వైశ్రాయ్ బాట పట్టారు.
ముఖ్యమంత్రి పదవితో పార్టీ అధ్యక్ష స్థానం నుంచి ఎన్టీఆర్‌ను కూలదోయడానికి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులను కలుపుకుని తాను అనుకున్నది సాధించారు. చివరికి ఎన్టీఆర్‌ను ఆగస్టు 23న పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడినే బహిష్కరించడం దేశంలో పెద్ద సంచలనమైంది.
పార్టీని స్థాపించిన తననే బహిష్కరించడం, నమ్మి చేరదీసినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆ మానసిక వ్యథతోనే చివరికి ఆయన ప్రాణాలు విడిచారు. బాబు వెన్నుపోటుకు ఈ రోజుతో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయన్న మాట.