రఘురామ తీగ లాగితే, చంద్రబాబు డొంక కదిలింది

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఏనాడూ కాస్త పట్టించుకోండయ్యా అంటూ గవర్నర్ కి లేఖ రాయలేదు చంద్రబాబు. ఆక్సిజన్ నిల్వలు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతే, కనీసం కేంద్రానికి ఓ ఉత్తరం ముక్క…

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఏనాడూ కాస్త పట్టించుకోండయ్యా అంటూ గవర్నర్ కి లేఖ రాయలేదు చంద్రబాబు. ఆక్సిజన్ నిల్వలు లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతే, కనీసం కేంద్రానికి ఓ ఉత్తరం ముక్క రాయలేదు. వ్యాక్సిన్ డోస్ లు కేంద్రం నుంచి రాకపోయినా.. బాధ్యతలేని ప్రతిపక్ష నేతగా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. 

కనీసం రామోజీ రావు కొడుకు వియ్యంకుడి కంపెనీ నుంచి వ్యాక్సిన్లు నేరుగా రాష్ట్రానికి వచ్చేలా సిఫార్సు లేఖ రాసే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడెప్పుడూ చంద్రబాబుకి లేఖలు రాయడానికి చేతులు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం రఘురామకృష్ణంరాజుకి ప్రాణహాని ఉందంటూ గవర్నర్ కి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.

రాబోయే రోజుల్లో బాబు నుంచి మరిన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరసబెట్టి లోక్ సభ స్పీకర్ కి, ప్రధానికి కూడా సదరు అరెస్ట్ అయిన ఎంపీ గురించి లేఖాస్త్రాలు సంధించే ఏకైక నాయకుడు చంద్రబాబే అనడంలో ఆశ్చర్యం లేదు.

రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని, సీఐడీ పోలీసుల దగ్గర వీడియో ఆధారాలున్నాయి. వాటిని సాక్ష్యాలుగా పెట్టుకునే ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు, ఏ2, ఏ3ల వ్యవహారాలను కూడా తేల్చబోతున్నారు. ఇక్కడ ఏ-1 నుంచి ఏ-3 వరకు అందరూ బాబుకి కావాల్సినవారే. ఎందుకంటే చంద్రబాబే ఈ మొత్తం వ్యవహారానికి మూలకారణం.

తన అనుకూల మీడియాతో స్క్రిప్ట్ రాయించడం దగ్గర్నుంచి, సోషల్ మీడియాలో రచ్చబండ రాజు వదిలిన వీడియోల్ని డౌన్ లోడ్ చేసుకుని టెలికాస్ట్ చేసి, వాటిపై చర్చలు పెట్టంచే వరకు అన్నీ చంద్రబాబు సూచనల ప్రకారమే జరిగాయి. రఘురామ తీగ లాగితే ఇప్పుడు చంద్రబాబు డొంక కదులుతుంది. అందుకే ఆయన తత్తరబిత్తరపడిపోతున్నారు. ఎంపీకి ప్రాణహాని ఉందని తెగ చించుకుంటున్నారు.

కొట్టడం అబద్ధమైతే.. ప్రాణహాని కూడా అబద్ధమేగా..?

సీఐడీ కస్టడీలో తనను కొట్టారంటూ రఘురామకృష్ణంరాజు చేసిన ఆరోపణలు తప్పని వైద్యపరీక్షల్లో తేలడంతో చంద్రబాబు షాకయ్యారు. ఎంపీని ఎలా కొడతారు, ఎందుకు హింసిస్తారంటూ రెచ్చిపోయిన బాబు బ్యాచ్.. వైద్యుల నివేదిక రావడంతో సైలెంట్ అయింది. కాళ్లలో నీరు చేరి పాదాలు రంగు మారాయని, దీన్ని ఎడెమా అని అంటారని వైద్యులు తేల్చారు.

అయితే అలా రంగుమారిన పాదాలు ఫొటోలు తీయించి తనను కొట్టారని రఘురామ చెప్పడం, వాటిని పదే పదే చూపిస్తూ బాబు అనుకూల మీడియా రెచ్చిపోవడం.. అబ్బ సీన్ ఎంత బాగా రక్తికట్టిందనే విషయం ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది. ఇక ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రాణహాని డ్రామా మొదలు పెట్టారు. కొట్టడం అబద్ధమని తేలిన తర్వాత, ప్రాణహాని అనేది కూడా అబద్ధమే కదా. ఆమాత్రం లాజిక్ లేకుండా చంద్రబాబు మరోసారి అందర్నీ మోసం చేయాలనుకుంటే ఎలా..?

రఘురామకృష్ణంరాజుపై చంద్రబాబుకి ప్రేమ ఉండొచ్చు, తాము అనలేని మాటలన్నిటినీ ఆయనతో అనిపించొచ్చు, ప్రభుత్వంపై నిందలు వేసేందుకు, జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు శిఖండిలా ఆయన్ను వాడుకోవాలని అనుకోవచ్చు. అంతమాత్రాన మరీ ఇంత బరితెగింపా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఏనాడూ ఎవరికీ లేఖలు రాయని బాబు, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ప్రాణాలు కాపాడండి అంటూ గవర్నర్ కి మొర పెట్టుకోవడం ఎక్కడి రాజనీతి. ఇది బాబు వేసుకున్న మరో పెద్ద సెల్ఫ్ గోల్.