అధర్మ యుద్దం చేయాలనుకున్నప్పుడు.. అడ్డదారులు తొక్కాల్సిందే. ఆ అడ్డదారుల కోసం కొంతమందిని ఉపయోగించుకోవాల్సిందే. గతంలో జగన్ తో యుద్ధం చేయడానికి పవన్ కల్యాణ్ ని అలాగే వాడుకున్నారు చంద్రబాబు.
బాబు నేరుగా రంగంలోకి దిగితే అసలుకే మోసం వస్తుందనుకునే సందర్భాల్లో.. పెంపుడు నాయకుల్ని మహ బాగా వాడుకుంటారు. సరిగ్గా ఇప్పుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామృష్ణ, బాబుకి అలాగే ఉపయోగపడుతున్నారు.
పవన్ కల్యాణ్ పక్కకు తొలగిపోయాక.. నేరుగా ఆర్కేకు ఆ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. వీరిద్దరూ జంటగా చంద్రబాబు చెప్పిన హోం వర్క్ పూర్తి చేసేవారు. బీజేపీ కన్నాకు చెక్ పెట్టిన తర్వాత ఆర్కే ఒంటరిగానే బాబు అజెండాని భుజానికెత్తుకుని ఎర్ర ముసుగేసుకుని పనులు చక్కబెడుతున్నారు.
తాజాగా పోలవరం పేరుతో జరుగుతున్న రాద్ధాంతం ఈ పచ్చ ప్లాన్ లో భాగమే. పోలవరం ప్రాజెక్ట్ ని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం గర్వంగా ప్రకటించిన నేపథ్యంలో బాబుకి ఏంచేయాలో పాలుపోలేదు.
ఇతర రాష్ట్రాలతో కేసులు వేయిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిధులు రాకుండా గతంలోనే కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. అనుకున్న సమయానికి పోలవరం పూర్తవుతుండే సరికి బాబు కడుపుమంట తీవ్రంగా పెరిగిపోయింది.
వెంటనే సీపీఐ రామకృష్ణను పోలవరంపైకి ఉసిగొల్పారు. ఇంకేముంది పోలవరం పరిరక్షణ యాత్ర పేరుతో సీపీఎం నేతృత్వంలో హడావిడి చేశారు, అరెస్ట్ లు అయ్యారు, ఆవేశంగా నినాదాలిచ్చారు.
పోలవరం నిషిద్ధ ప్రాంతమా అంటూ భారీ డైలాగులు కొట్టారు. ఆ వెంటనే చంద్రబాబు కలుగజేసుకోవడం.. ఈ వార్తల్ని పచ్చ మీడియా హైలెట్ చేయడం అన్నీ చకచకా సీరియల్ ఎపిసోడ్ల లాగా జరిగిపోయాయి.
మొత్తమ్మీద పోలవరంలో ఏదో జరిగిపోతోందని, చూడటానికి వెళ్తున్న నాయకుల్ని వైసీపీ ప్రోద్బలంతో పోలీసులు అడ్డుకుంటున్నారని రచ్చ చేశారు. మా హయాంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి ఉచితంగా తీసుకెళ్లాం, మీరెందుకు తీసుకెళ్లరంటూ చెత్త లాజిక్ తీశారు బాబు.
వచ్చే ఎన్నికల వరకు పోలవరం అంశాన్ని పట్టుకుని వేలాడదామనుకున్న బాబు పప్పులు ఉడక్కపోయే సరికి ఇలా అడ్డదారిలో సీపీఎం నేతల్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలంటూ సింపతీ కోసం ట్రై చేస్తున్నారు. పోలవరంపై బురదజల్లేందుకు ఆఖరి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలనుకుంటున్నారు.