అమ‌రావ‌తి ఊబిలో బాబు

నెల రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడ్డం ఎలా? నెల రోజుల్లో త‌మిళం, హిందీ మాట్లాడ్డం ఎలా? అనే శీర్షిక‌ల‌తో పుస్తక దుకాణాల బ‌య‌ట వేలాడుతున్న పుస్త‌కాలు క‌నిపిస్తుంటాయి. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ భాషలు నేర్చుకోవ‌డం…

నెల రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడ్డం ఎలా? నెల రోజుల్లో త‌మిళం, హిందీ మాట్లాడ్డం ఎలా? అనే శీర్షిక‌ల‌తో పుస్తక దుకాణాల బ‌య‌ట వేలాడుతున్న పుస్త‌కాలు క‌నిపిస్తుంటాయి. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ భాషలు నేర్చుకోవ‌డం వ‌ల్ల… ఉపాధి అవ‌కాశాల‌ను కూడా అంతే ఎక్కువ‌గా పొందే అవ‌కాశం ఉంది. ఇలాంటి పుస్త‌కాలు ఎక్కువ‌గా సేల్ అవుతున్నాయి కూడా. ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌రిదీ బ‌తుకుదెరువు స‌మ‌స్య‌.

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి రాజ‌కీయ ఉనికి పెద్ద  స‌మ‌స్యగా మారింది. దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? అనేది ఇప్పుడాయ‌న ఎదుట నిలువెత్తు ప్ర‌శ్న నిటారుగా నిలిచి విక‌టాట్ట‌హాసం చేస్తోంది. మూడు రాజ‌ధానుల బిల్లులు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కూడా పొంద‌డంతో ఆయ‌న, ఆయ‌న న‌మ్ముకున్న వాళ్ల ఆర్థిక సామ్రాజ్యం…క‌ళ్లెదుటే పేక మేడ‌లా కూలుతోంది. ఈ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబుతో పాటు ముఖ్యంగా ఆయ‌న సామాజిక వ‌ర్గంలోని సంప‌న్నులు జీర్ణించుకోలేక పోతున్నారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం కంటే కూడా రాజ‌ధాని త‌ర‌లింపే వారిని తీవ్రంగా క‌ల‌చివేస్తోంది. మ‌రోవైపు ఎలాగైనా రాజ‌ధానిని అడ్డుకుంటామంటూ ప్ర‌గ‌ల్భాలు పలుకుతూ వ‌స్తున్న చంద్ర‌బాబు, ఆయ‌న పెంచిపోషిస్తున్న వివిధ పార్టీల్లోని నాయ‌కుల‌కు ఇప్పుడు స‌రికొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. మూడు రాజ‌ధానుల బిల్లులకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో ఇటు ఉత్త‌రాంధ్ర‌, అటు రాయ‌ల‌సీమ ప్ర‌జానీకం రాజ‌ధాని ఊహ‌ల్లో విహ‌రిస్తోంది.

ఈ నేప‌థ్యంలో సాధ్యం కాని అమ‌రావ‌తిని ప‌ట్టుకుని వేలాడితే…ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే ప్ర‌మాదం ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారు. దీంతో రాజ‌ధాని పోరాటాన్ని పార్టీగా వ‌దిలేసి, అమ‌రా వ‌తి జేఏసీ భుజాన మోపి సైడ్ అవుదామ‌ని చంద్ర‌బాబు అలోచిస్తున్నారు.

అందుకే మూడు రాజ‌ధానుల బిల్లులు ఆమోదం పొంద‌గానే అమ‌రావ‌తి జేఏసీ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆందోళ న‌ల‌కు సంఘీభావం తెల‌పాల‌ని పార్టీ శ్రేణుల‌కు బాబు పిలువు ఇవ్వ‌డం వ్యూహంలో భాగ‌మే. నిజంగా అమ‌రావ‌తిపై ప్రేమే ఉంటే రాజ‌ధానిని అక్క‌డే కొన‌సాగించాల‌ని టీడీపీ శ్రేణులు ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌కు ఎందుకు దిగ‌డం లేదు? ఈ ప్ర‌శ్న‌కు బాబు స‌మాధా నం చెప్పాల్సిన ప‌ని లేదా?

రాజ‌ధాని ఇష్యూ నుంచి రాజ‌కీయాల‌ను దారి మ‌ళ్లించేందుకు చంద్ర‌బాబు వేసిన ఎత్తుగ‌డే అసెంబ్లీ ర‌ద్దు స‌వాల్‌. బాబు ఐదేళ్ల పాల‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఏడాది క్రిత‌మే తీర్పు చెప్పారు. టీడీపీ కాళ్లూ చేతులూ విర‌గ్గొట్టి మూల‌న కూచోబెట్టారు. రాయ‌ల‌సీ మ‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చంద్ర‌బాబునాయుడు…త‌న జిల్లాలో ప్ర‌ఖ్యాతిగాంచిన పుత్తూరు క‌ట్టు క‌ట్టించుకుని నెమ్మ‌దిగా కోలుకోవాల‌నుకుంటున్న ద‌శ‌లో మ‌రో పిడుగుపాటు. అభివృద్ధి, ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యంతో టీడీపీ నిలువునా కూలిపోయింది.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే పిలుపుతో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి, ఉద్య‌మాన్ని లేవనెత్తాల‌నే బాబు ప్ర‌య‌త్నాలు వ‌ర్కౌట్ కాలేదు. మ‌రోవైపు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌లో బాబుపై అంత‌కంత‌కూ ఆగ్ర‌హం పెరిగిపోతోంది. ఇదే స‌మ‌యంలో క‌నీసం కృష్ణా, గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి బాబుకు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. అప్పుడు గానీ బాబుకు అర్థం కాలేదు…తాను అమ‌రావ‌తి ఊబిలో ఇరుక్కుపోయాన‌ని.

ఇక‌పై అమ‌రావ‌తిని ప‌ట్టుకుని ఊగులాడితే…కుక్క తోక‌ను ప‌ట్టుకుని స‌ముద్రాన్ని ఈదిన‌ట్టేన‌నే భావ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చి న‌ట్టు…ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి చూస్తే అర్థ‌మ‌వుతుంది. అందువ‌ల్లే అమ‌రావ‌తి కోసం పోరాడుతున్న‌ట్టు రాజ‌ధాని రైతుల‌ను న‌మ్మించేందుకు  అసెంబ్లీ ర‌ద్దు స‌వాల్‌ను జ‌గ‌న్‌కు విసిరారు. ఇందుకోసం 48 గంట‌ల డెడ్‌లైన్‌ను కూడా జ‌గ‌న్‌కు బాబు విధించారు. అప్ప‌టికీ స్పందించ‌క‌పోతే తాను మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చి ప్ర‌తి అంశంపై చ‌ర్చిస్తాన‌ని,  వాస్త‌వాలు, గ‌ణాంకాలు ప్ర‌జ‌ల ముందు పెడుతాన‌ని హెచ్చ‌రించారు.  

చంద్ర‌బాబు స‌వాల్‌తో అమ‌రావ‌తి, రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌లు ప‌క్క‌కు పోయాయి. తెలంగాణ కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప‌లు ద‌ఫాలు రాజీనామా చేయ‌డం, కేసీఆర్ స్ఫూర్తితో అమ‌రావ‌తిపై నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే చంద్ర‌బాబు కూడా రాజీనామా చేయాల‌నే ప్ర‌తి స‌వాళ్లు హైలెట్ అవుతున్నాయి. చంద్ర‌బాబు కూడా కోరుకుంటున్న‌ది ఇదే. పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల రాజీనామా  స‌వాళ్ల వ‌ల్ల న‌ష్ట‌పోయేది రాజ‌ధాని రైతులే.

ఈ విష‌యాన్ని రాజ‌ధాని రైతులు గ్ర‌హించి మేల్కోవాలి. రాష్ట్రంలో 75  శాతం ప్రజలు మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ యాన్ని ఆమోదించ‌డం లేద‌ని నిన్న కూడా చంద్ర‌బాబు అన్నారు. అలాంట‌ప్పుడు మొత్తం త‌న 20 లేదా 23 మంది స‌భ్యుల‌తో రాజీ నామా చేయించ‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌ని రాజ‌ధాని రైతులు ప్ర‌శ్నించాలి. బుధ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు తిరిగి చంద్ర‌బాబు వీడియా కాన్ఫ‌రెన్స్‌లో మీడియాతో మాట్లాడి ఏం చెబుతారు? త‌న స‌వాల్‌కు అధికార పార్టీ తోక‌ముడిచింద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేస్తారు. బాబుకు అధికార పార్టీ నుంచి వెంట‌నే కౌంట‌ర్ వ‌స్తుంది.

పాల‌క‌ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య ఒక వైపు స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల తంతు న‌డుస్తుంటే, మ‌రోవైపు రాజ‌ధాని త‌ర‌లిపోవ‌డం ఖాయం. అందువ‌ల్ల రాజ‌ధాని రైతులు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి రాజ‌కీయ పార్టీల‌న్నింటిని నిల‌దీయాలి. అప్పుడు ఎవ‌రి చిత్త‌శుద్ధి ఏంటో తేలిపోతుంది. అమ‌రావ‌తి ఊబి నుంచి చంద్ర‌బాబు ఎలా బ‌య‌ట‌ప‌డుతారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి ఉంది. 

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే