నవరత్నాలకు జై కొడదామా? టీడీపీలో అంతర్మథనం

ఆల్రెడీ రెండేళ్లు గడిచిపోయాయి. వచ్చే ఎన్నికలకి ఎలా సన్నద్ధమవ్వాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టమైన అజెండా టీడీపీ వద్ద లేదు. వైసీపీ మాత్రం నవరత్నాల పథకాల కొనసాగింపు, పథకాలకు మరిన్ని మెరుగులద్దడమే అజెండాగా ఎన్నికలకు వెళ్లే…

ఆల్రెడీ రెండేళ్లు గడిచిపోయాయి. వచ్చే ఎన్నికలకి ఎలా సన్నద్ధమవ్వాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టమైన అజెండా టీడీపీ వద్ద లేదు. వైసీపీ మాత్రం నవరత్నాల పథకాల కొనసాగింపు, పథకాలకు మరిన్ని మెరుగులద్దడమే అజెండాగా ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. 

అదే సమయంలో టీడీపీ ఆయా పథకాలను కనీసం విమర్శించాలి, లేదా పొగడాలి, లేదా పూర్తిగా తొలగిస్తామని అయినా చెప్పాలి. ఈ దశలో టీడీపీ స్టాండ్ ఏమిటనేది సస్పెన్స్ గా మారింది.

ఇటీవల పార్టీ మీటింగ్ లో నవరత్నాలపై ఏం చేద్దామనే టాపిక్ వచ్చింది. కొనసాగిస్తామని చెప్పడంతో పాటు, లోటుపాట్లను సరిదిద్దుతామని చెబుతూ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారట. కొనసాగిస్తామంటే వాటిని వైసీపీ విజయాలుగా ఒప్పుకున్నట్టే కదా అని ఓ సీనియర్ ప్రశ్నించారట. దీంతో మరోసారి చంద్రబాబు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. 

జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం, కార్యక్రమంపై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు.. నవరత్నాలపై మాత్రం ఇప్పటివరకు ఎటూ తేల్చుకోలేకపోవడం విశేషం.

సచివాలయాల వ్యవస్థ మాదే, దానికి రంగులేసి మాయ చేశారనేది చంద్రబాబు ప్రధాన ఆరోపణ. కానీ సచివాలయాల వల్ల లక్షన్నరమందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. మరో రెండున్నర లక్షల మంది వాలంటీర్ పోస్టుల్లో ఉన్నారు. అంటే కొత్తగా 4లక్షలమందికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే ఉపాధి చూపించింది. 

వాలంటీర్లకు ఇచ్చే జీతమెంత..? సచివాలయం పోస్టుల్ని పర్మినెంట్ చేశారా..? ఇలాంటి ప్రశ్నల్ని పక్కనపెడితే ఉద్యోగావకాశాల్ని చూపించడంలో జగన్ రికార్డ్ ని ఎవరూ బద్దలుకొట్టలేరనేది మాత్రం వాస్తవం.

నవరత్నాల్లో కీలకమైన సచివాలయాలపై చంద్రబాబుకి ఎప్పుడూ చిన్నచూపే ఉంది. వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేననేది టీడీపీ ఆరోపణ. అలాగని తాను అధికారంలోకి వస్తే వారిని తొలగిస్తామని చెప్పే దమ్ము మాత్రం చంద్రబాబుకి లేదు. 

ఎందుకంటే వాలంటీర్లలో చాలామంది టీడీపీ అభిమానులున్నారు. ఒకటి రెండు చోట్ల వాలంటీర్లు ఉద్యోగం మానేసి మరీ స్థానిక సంస్థల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఉదాహరణలున్నాయి. అలాంటి వ్యవస్థను తూలనాడొచ్చు కానీ తుడిచిపెడతాననే సాహసం బాబు చేయరు.

అమ్మఒడిని నాన్నబుడ్డితో పోలుస్తూ హేళన చేయొచ్చు కానీ, నేను అధికారంలోకి వస్తే అమ్మఒడి క్యాన్సిల్ అనే దమ్ము చంద్రబాబుకి లేదు. ఈ దశలో నవరత్నాలతోనే చంద్రబాబుకి సమస్యలన్నీ.

అప్పుడు జలయజ్ఞం, ఇప్పుడు నవరత్నాలు

వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన జలయజ్ఞంను అప్పట్లో చంద్రబాబు, అతడి అనుకూల మీడియా ఎంతలా ప్రతిఘటించిందో అందరికీ తెలిసిందే. జలయజ్ఞం-ధనయజ్ఞం అంటూ హెడ్డింగులు పెట్టి మరీ ఆ బృహత్తర కార్యక్రమాన్ని అభాసుపాలు చేసే పని చేసింది. 

ఇప్పుడు అదే కోవలో నవరత్నాల్ని కూడా అనుకూల మీడియా సహకారంతో విమర్శించాలనుకున్నారు బాబు. కానీ ఈసారి బాబు పప్పులుడకలేదు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్ని మెచ్చుకోలేక, అలా అని విమర్శించలేక తెగ ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఈ నవరత్నాలే కీలకంగా మారడంతో బాబు, ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. 

తాజా సమాచారం ప్రకారం.. నవరత్నాలను కొనసాగిస్తామని చెబుతూనే వాటికి మెరుగులద్ది మరింత సమర్థంగా అమలు చేస్తామని చెప్పుకుంటారట టీడీపీ నేతలు. అదే కనుక జరిగితే జగన్ పథకాలను, చంద్రబాబు సమర్థించినట్టే లెక్క.