విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి మొత్తం ఉత్తరాంధ్రను ఏకం చేశారు జగన్. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయన్నారు. దానికి తగ్గట్టే రూటు మ్యాప్ కూడా రెడీ చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పోర్టుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నారు.
బాబు ఏం చేస్తున్నారు..?
జగన్ ఉత్తరాంధ్ర ను ఏకం చేయాలని చూస్తుంటే, బాబు మాత్రం విభజించు-పాలించు అనే పద్ధతి తెరపైకి తెస్తున్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కడికక్కడ స్థానిక సమస్యల్ని హైలెట్ చేసి.. విశాఖ రాజధాని అంశం నుంచి ప్రజల్ని మళ్లించడానికి బాబు ప్లాన్ చేశారు.
విశాఖ రాజధాని అయితే.. ఆ జిల్లాకు, ఆ జిల్లా నాయకులకు మాత్రమే ప్రయోజనం అనే వితండవాదం మొదలు పెట్టారు. విశాఖ రాజధాని అయినా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సమస్యలు తీరిపోవని, ఇంకా ఎక్కువవుతాయని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు లాంటి అంశాల్ని లేవనెత్తుతున్నారు.
సీమలోనూ ఇదే పంథా..
గతంలో రాయలసీమలో కూడా ఇదే ఎత్తుగడ అమలు చేశారు బాబు. అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో స్థానిక సమస్యల్ని లేవనెత్తి రాజకీయం చేయాలనుకున్నారు. జగన్ కేవలం కడప పక్షపాతి అనే వాదన తెరపైకి తెచ్చారు.
అనంతపురం, చిత్తూరు జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, వైఎస్ హయాంలో కూడా ఆ రెండు జిల్లాల్లో అభివృద్ధి జరగలేదని మొసలి కన్నీరు కార్చేవారు. కానీ బాబు మాటల్ని సీమవాసులు నమ్మలేదు. 2019 ఎన్నికల్లో గట్టి షాకిచ్చారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల తర్వాత సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చంద్రబాబు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది.
ఉత్తరాంధ్రలో కూడా బాబుకి ఎదరుదెబ్బ..
తనకు నలుగురు ఎమ్మెల్యేలను ఇచ్చిన విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు నీఛ మనస్తత్వాన్ని విశాఖ వాసులు బాగా అర్థం చేసుకున్నారు. అంతే కాదు.. విభజన తర్వాత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే బాధ కూడా వారిలో ఉంది.
విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే, అది కచ్చితంగా మూడు జిల్లాలకు ఉపయోగం అని ఆ ప్రాంత వాసులు నమ్ముతున్నారు. సో.. చంద్రబాబు విభజన సూత్రం.. రాయలసీమలో ఎలా ఫెయిలైందో, ఉత్తరాంధ్రలో కూడా అదే విధంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది.