తిరుపతి బై-పోల్: బాబు బకరా కాబోతున్నారా?

గ్రేటర్ లో ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో కూడా కనీసం ప్రచారానికి వెళ్లలేక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒక్క ట్వీట్ వేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు బాబు. అటు నోటిఫికేషన్ ఇంకా రాని తిరుపతి…

గ్రేటర్ లో ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో కూడా కనీసం ప్రచారానికి వెళ్లలేక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఒక్క ట్వీట్ వేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్నారు బాబు. అటు నోటిఫికేషన్ ఇంకా రాని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు మాత్రం ముందే అభ్యర్థిని ప్రకటించి అభాసుపాలయ్యారు. 

అసలు ఎప్పుడు జరుగుతాయో తెలియని స్థానిక ఎన్నికలకు మేం రెడీ అంటూ సవాల్ విసురుతున్నారు. ఇదీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి.

మరీ ముఖ్యంగా తిరుపతి ఉప-ఎన్నిక చంద్రబాబు ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజీ చేస్తోందని రాజకీయ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేశారనే కారణంతోనే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ఎంచుకున్నారు తప్ప, కనీసం సంప్రదింపులు కూడా జరపలేదనేది వాస్తవం.

అందుకే బాబు ప్రకటన వచ్చి ఇన్ని రోజులైనా పనబాక తాను టీడీపీ తరపున బరిలో ఉన్నానంటూ ఒక్క కన్ఫర్మేషన్ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఆమె తరపున ఇంకెవరూ ఆ మాట చెప్పలేదు. కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న పనబాకకు తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం సుతరామూ ఇష్టంలేదు. 

నిజానికి ఆమె వైసీపీ తరఫున బరిలో దిగాలని విశ్వప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే ఏ దశలోనూ జగన్ ఈమెను ఎంకరేజ్ చేయలేదని తెలుస్తోంది.

అధికార పక్షం కనీసం గేటు దాకా కూడా రానీయకపోవడంతో పనబాక సైలెంట్ అయ్యారు. ఓవైపు వైసీపీతో తెరవెనక రాయబారం నడుస్తున్న టైమ్ లోనే చంద్రబాబు ఈమె పేరును ప్రకటించడంతో పనబాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. 

టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఆమె పెద్దగా ఇష్టం కనబరచడం లేదు. ఆర్భాటంగా ప్రకటించిన అభ్యర్థి సైలెంట్ అవ్వడంతో బాబు రాయబారాలు మొదలుపెట్టారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ఓ దఫా చర్చలు జరిపినా ఫలితం లేదు.

చివరకు పనబాక పోటీ నుంచి విరమించుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటి? కాస్త రేంజ్ ఉన్న అభ్యర్థి అయినా దొరుకుతారా లేదా అనేది సమస్య.

2019 ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఆదాల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, ఆయన కొన్నాళ్లు టీడీపీ తరపున ప్రచారం చేయడం కూడా ప్రజలు చూశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో ఆయన జెండా మార్చేసి వైసీపీ తరపున బరిలో నిలిచి గెలిచారు. అప్పుడు ఆదాల పార్టీ మార్చి షాకిస్తే, ఇప్పుడు పనబాక పోటీ నుంచి తప్పుకుని బాబుకు షాకిస్తారనే అంచనాలున్నాయి.

అటు వైసీపీ మాత్రం అసంతృప్తులను ముందే బుజ్జగించేసి, అభ్యర్థి పేరు అందరికీ తెలిసేలా చేసి, అధికారిక ప్రకటనపై గుంభనంగా ఉంది. బాబు మాత్రం తన తొందరపాటుతో పూర్తిగా అభాసుపాలవుతున్నారని అర్థమవుతోంది. మొత్తమ్మీద తిరుపతి పొలిటికల్ డ్రామాలో బకరా అవ్వడానికి బాబు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.

గ్రేటర్ గెలుపు ఎవరిది