కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు వైసీపీ తమ అభ్యర్థిని రెడీ చేసుకుంది. అయితే అనౌన్స్ చేయలేదు. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో బద్వేలుకు ఉప ఎన్నిక జరగనుంది.
గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎవరైనా చనిపోతే సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకే ఏకగ్రీవంగా పదవి ఇవ్వాలని తీర్మానించారు. ఈ సంప్రదాయం కొంత కాలం బాగానే సాగింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఏకగ్రీవంగా ఇచ్చే సంప్రదాయానికి కొన్ని పార్టీలు అడ్డు చెబుతున్నాయి. దీంతో ఉప ఎన్నిక తప్పని సరైంది.
ఇదిలా ఉండగా ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే చూసుకుందాంలే అనే రీతిలో ఏపీ రాజకీయ పార్టీలున్నాయి. అంత మాత్రాన ఏపీ అధికార పార్టీ బద్వేలు ఉప ఎన్నికను నాన్ సీరియస్‌గా తీసుకుందనుకుంటే పొరపాటే. ఇప్పటికే తమ అభ్యర్థిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సంధ్యను ఎన్నికలో బరిలో నిలిపేందుకు జగన్ నిర్ణయించినట్టు సమాచారం.
ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని డాక్టర్ సంధ్యకు జగన్ సూచించినట్టు సమాచారం. గత నెలలో బద్వేలులో సీఎం పాల్గొన్న మీటింగ్‌కు డాక్టర్ సంధ్య హాజరయ్యారు. అలాగే నియోజకవర్గంలో నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా డాక్టర్ సంధ్య పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ రావడమే ఆలస్యం, ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.