గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో.. సినీనటుడు, నిర్మాత, మాజీ పొలిటీషియన్ బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం 2 రోజులుగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఈసారి ఆయన బీజేపీలో చేరి హైదరాబాద్ కేంద్రంగా క్రీయాశీలకంగా మారుతారని అంతా ఊహించారు.
తన పొలిటికల్ రీఎంట్రీపై ఊహాగానాలు మొదలైన వెంటనే బండ్ల గణేష్ స్పందించారు. బీజేపీలో చేరడం లేదని స్పష్టంచేశాడు. అంతేకాదు.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు.
నిజానికి బండ్ల ఇలా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా ఇక రాజకీయాలకు దూరమంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. పలు ఇంటర్వ్యూల్లో కూడా అదే విషయాన్ని రిపీట్ చేశారు.
అయితే హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. పవన్ కల్యాణ్ కూడా బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో.. బండ్ల గణేష్ కూడా అదే బాటలో పయనిస్తారని, భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆయన తన పొలిటికల్ కెరీర్ పై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు.
గత తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలకు శ్రీకారం చుట్టారు బండ్ల. అధికార ప్రతినిథి హోదాలో హల్ చల్ చేశారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో రచ్చరచ్చ చేశారు.
కాంగ్రెస్ గెలవకపోతే ''7ఓ క్లాక్'' బ్లేడుతో గొంతు కోసుకుంటానని సవాల్ విసిరారు. ఆ డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం, బండ్ల గణేశ్ తన సవాల్ నుంచి వెనక్కు తగ్గడం చకచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత కొన్నాళ్లకు తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు బండ్ల. అప్పట్నుంచి ఈరోజు వరకు ఆయన మినిమం గ్యాప్స్ లో తను రాజకీయాలకు దూరం అంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. గతంలో తను చేసిన వ్యాఖ్యల్ని మళ్లీ వైరల్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు.